- ఆడిట్ లెక్కలను అసెంబ్లీలో ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
- ఇది గత కాంగ్రెస్ సర్కారు పాపమేనన్న బీజేపీ
- ఈ ప్రభుత్వానికి సరైన ప్లాన్ లేదన్న కాంగ్రెస్
జైపూర్: రాజస్తాన్‌లోని 611 ప్రభుత్వ బడులకు సొంత భవనాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శాసనసభకు వెల్లడించింది. సురక్షితం కాని భవనాల అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తగా, మరమ్మతులు, నిర్మాణాల కోసం నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
సమగ్ర శిక్షా అభియాన్ కింద 2025-–26 సంవత్సరానికి సంబంధించి యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడీఐఎస్‌ఈ) డేటా ప్రకారం.. రాష్ట్రంలోని 611 ప్రభుత్వ పాఠశాలలకు భవనాలు లేవు. ఇందులో 10 బాలికల పాఠశాలలు కూడా ఉన్నాయి.
అయితే, సొంత భవనాలు కలిగిన 64,484 ప్రభుత్వ పాఠశాలల్లో, 2,047 పాఠశాలల్లో టాయిలెట్ సౌకర్యాలు లేవు. అలాగే 1,049 పాఠశాలల్లో తాగునీటి కొరత వేధిస్తోంది. గత నెలలో ఝలావర్‌లోని ప్రభుత్వ బడి భవనం కూలి ఏడుగురు విద్యార్థులు మరణించిన తర్వాత ఆడిట్ నిర్వహించగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. తాజాగా రాష్ట్రంలోని స్కూళ్ల పరిస్థితిపై అసెంబ్లీలో కాంగ్రెస్ సభాపక్ష నేత టికా రామ్ జుల్లీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఈ వివరాలను బయటపెట్టింది.
అయితే, బడుల మరమ్మతులు, పునరుద్ధరణ కోసం రూ. 550 కోట్లు, శిథిలావస్థలో ఉన్న భవనాలలో నడుస్తున్న పాఠశాలలకు భవనాల నిర్మాణం కోసం రూ. 450 కోట్లు కేటాయించినట్లు రాజస్తాన్ ప్రభుత్వం తెలిపింది. భవనాల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణకు ఏడాదికి రూ. 2,500 కోట్లు, ఐదు సంవత్సరాలకు రూ. 12,500 కోట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం
రాజస్తాన్‌లోని ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల లోపాలకు గత కాంగ్రెస్ నాయకత్వంలోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వమే కారణమని బీజేపీ ప్రభుత్వం ఆరోపించింది. ఝలావర్‌లోని ప్రభుత్వ బడి భవనం కూలిన తర్వాత ఆడిట్ నిర్వహించగా రాష్ట్రంలో ప్రభుత్వ బడుల దుస్థితి బట్టబయలైందని పేర్కొంది. ఇది గత సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ ‘పాపం’ అని అభివర్ణించింది.
ప్రస్తుత ప్రభుత్వం ఆ సమస్యను సరిదిద్దడానికి ప్రయత్నిస్తోందని వెల్లడించింది. అయితే, ప్రభుత్వ ప్రకటనను ప్రతిపక్ష నేత టికా రామ్ జుల్లీ తిరస్కరించారు. రాష్ట్రంలో 3,768 ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయన్నారు. అలాగే, 83,783 గదులు కూడా వినియోగానికి అనువుగా లేవన్నారు.
ఈ విషయంలో ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని విమర్శించారు. మరోవైపు, జైపూర్ సమీపంలోని గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేయడానికి వెళ్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కో-కన్వీనర్ అశుతోష్ రంకా నేతృత్వంలోని బృందంపై దాడి జరగడం సంచలనంగా మారింది.
ఆన్‌లైన్ పరీక్ష మధ్యలో పవర్ కట్
ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏఐఏపీజీఈటీ) నిర్వహణలో సాంకేతిక లోపం తలెత్తడంతో 49 మంది అభ్యర్థులు పరీక్షను రాయలేకపోయారు. జైపూర్ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విచారం వ్యక్తం చేసింది. ఆ అభ్యర్థులకు సెప్టెంబర్ 1న రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
శనివారం దేశంలోని 200 సెంటర్లలో ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షను ఒకేసారి నిర్వహించారు. మొత్తం 36,979 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 35,837 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే, జైపూర్‌లోని శ్రీ సత్యసాయి పీజీ కాలేజ్ సెంటర్‌లో ఎగ్జామ్ జరుగుతుండగా హఠాత్తుగా కరెంట్ పోవడంతో కంప్యూటర్లు నిలిచిపోయాయి. అక్కడ పరీక్ష రాస్తున్న 192 మందిలో 49 మంది తమ పరీక్షను పూర్తి చేయలేకపోయారు.
నిర్వహణ సంస్థ వైఫల్యమే దీనికి కారణమని ఎన్‌టీఏ తెలిపింది. బాధిత విద్యార్థులకు సెప్టెంబర్ 1న ఉదయం 10 గంటలకు రాజస్తాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ కేంద్రంలో తిరిగి పరీక్షను నిర్వహిస్తామని పేర్కొంది.
