హోమ్ లోన్స్ ట్రాప్‌లో పడకండి: జెన్‌జీకి ముంబై మహిళ రియాలిటీ అడ్వైజ్..!

హోమ్ లోన్స్ ట్రాప్‌లో పడకండి: జెన్‌జీకి ముంబై మహిళ రియాలిటీ అడ్వైజ్..!

ముంబైలోని ఓ ఖరీదైన రెసిడెన్షియల్ సొసైటీలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఒక దృశ్యం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కోట్లు విలువ చేసే ఇండ్లు, లక్షల్లో అద్దెలు ఉండే ఆ సొసైటీలో రాత్రిపూట గార్డెన్లు, పార్కింగ్ స్థలాలు పూర్తిగా నిర్మానుష్యంగా ఉండటం అందరినీ ఆలోచింపజేస్తోంది. ఈ ద్యశ్యాలను రికార్డ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ రుచి దూబే.. ఇంత ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేసేవారికి, వాటిలోని సౌకర్యాలను అనుభవించే సమయం కూడా ఉంటోందా అనే ప్రశ్నను లేవనెత్తారు.

భారీ హోమ్ లోన్‌లు తీసుకుని, వాటిని చెల్లించడానికే తమ జీవితంలోని ఎక్కువ భాగాన్ని ఉద్యోగాల కోసం వెచ్చిస్తున్నారని ఆమె చెప్పారు. రాత్రి సమయాల్లో ప్రశాంతమైన వాతావరణాన్ని, వ్యూవ్ ను, వాకింగ్‌ను ఆస్వాదిస్తున్నారంటే అది కేవలం ఎటువంటి బాధ్యతలు లేని కొద్దిమంది మాత్రమేనని ఆమె పేర్కొన్నారు. కోట్లు పెట్టి ఇల్లు కొన్న యజమానులకు మాత్రం ఆ సొసైటీలోని సౌకర్యాలను ఆస్వాదించే తీరిక కూడా లేదని వాస్తవికత గురించి మాట్లాడారు.

జెన్ జీ యువత తొందరపాటులో చిన్న వయసులోనే భారీ హోమ్ లోన్స్ తీసుకుంటున్నారని రుచి దూబే హెచ్చరించారు. జీవితాంతం ఆ లోన్‌లను తీర్చడానికే సరిపోతుందని, దీనివల్ల జీవితంలోని అసలైన ఆనందాన్ని కోల్పోతున్నామని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నా చాలా జాగ్రత్తగా ఆలోచించాలని, లేదంటే ఆ తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుందని యువతకు సూచించారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ruchi Dubey (@_ruuchi.dubey)

‘ఈ హోమ్ లోన్ ఉచ్చులో చిక్కుకోవద్దు’ అంటూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది యువకులు నిజంగానే హోమ్ లోన్ ఉచ్చులో చిక్కుకుని సతమతమవుతున్నారని కొందరు కామెంట్ చేయగా, మరికొందరు ఆమె చెప్పిన మాటల్లో పూర్తి వాస్తవముందని సమర్థించారు. ఆర్థిక భారం మోస్తూ క్షణం తీరిక లేకుండా బతకడం కంటే, మన స్థోమతకు తగినట్లు జీవించడమే మేలనే చర్చ జోరందుకుంది.

ఇది కేవలం ముంబై సొసైటీకి మాత్రమే పరిమితం కాదు, మోడ్రన్ కార్పొరేట్ జీవితాల దుస్థితికి అద్దం పడుతోంది. సొంతిల్లు ఉండాలనే కల మంచిదే అయినప్పటికీ.. దానికోసం జీవితంలోని ప్రశాంతతను, ఆనందాన్ని  కోల్పోవడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. కెరీర్, బాధ్యతలతో పాటు వ్యక్తిగత జీవితానికి, మానసిక ప్రశాంతతకు సమయం కేటాయించడం చాలా ముఖ్యమని ఈ ఘటన నిరూపిస్తోంది. పైకి షో చేసేందుకు లేదా నలుగురిలో మెప్పు కోసం లోన్స్ ఉచ్చులో చిక్కుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న వేళ ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.