సీఈఐ, ఈసీల నియామక చట్టం: విభేదాల తీర్పుపై రీకాల్ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

సీఈఐ, ఈసీల నియామక చట్టం: విభేదాల తీర్పుపై రీకాల్ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

ముఖ్య ఎన్నికల కమిషనర్(CEC), ఇతర ఎన్నికల కమిషనర్ల(ECs) నియామకానికి సంబంధించిన 2023 చట్టంపై ఇటీవల వచ్చిన స్ప్లిట్ తీర్పుపై పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్‌ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ధర్మాసనానికి సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన సీజేఐ.. ఈ అంశాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

సెప్టెంబర్ 23న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం 2023 చట్టం సవాళ్లను పెద్ద రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఈ చట్టంపై రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను పెద్ద బెంచ్‌కు పంపాలనే కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలతో చీలిక తీర్పునిచ్చారు. జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ రిఫరెన్స్‌ను తోసిపుచ్చగా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ మాత్రం దీనిని పెద్ద బెంచ్‌కు పంపాలని అనుకూలంగా స్పందించారు.

ఈ భిన్నాభిప్రాయాల నేపథ్యంలో తదుపరి నిర్ణయం కోసం ఈ కేసును సీజేఐ పరిపాలనాపరమైన వైపునకు పంపాలని ఆ ధర్మాసనం సూచించింది. తాజాగా ఈ తీర్పును రీకాల్ చేయాలని కోరుతూ పిటిషనర్ల తరఫు న్యాయవాది సీజేఐ ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ రీకాల్ అప్లికేషన్‌తో పాటు ఒక క్యూరేటివ్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2023 చట్టం ప్రకారం సీఈఐ, ఈసీల ఎంపిక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించడంపై ప్రస్తుతం తీవ్రమైన న్యాయపరమైన చర్చ జరుగుతోంది.

ఈ వివాదాస్పద అంశంపై అత్యున్నతన్యాయస్థానం త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. సీఈఐ నియామక చట్టం, ఈ నియామక ప్రక్రియపై దాఖలైన పిటిషన్ల విచారణ దేశ రాజకీయ, న్యాయ వర్గాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకునే తదుపరి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.