ధైర్యముంటే నన్ను అరెస్ట్ చేయండి, ఎలాంటి కేసులు పెట్టినా భయపడేది లేదు: సీజేపీ నేత సవాల్!

ధైర్యముంటే నన్ను అరెస్ట్ చేయండి, ఎలాంటి కేసులు పెట్టినా భయపడేది లేదు: సీజేపీ నేత సవాల్!

ఓటర్ల లిస్ట్  సవరణ (SIR)లో అవకతవకలు జరిగాయని, ‘ఓటు దొంగతనం’ ఆరోపణలపై చీఫ్  ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చారు. అయితే, ఈ ఆందోళనను అణచివేసేందుకు మహారాష్ట్ర పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.   

కార్యకర్తలకు పోలీసు నోటీసులు:  
న్యూఢిల్లీలో జరగబోయే నిరసన కార్యక్రమంలో పాల్గొనవద్దని మహారాష్ట్రలోని చంద్రాపూర్ (బల్లార్పూర్) పోలీసులు CJP పార్టీ కార్యకర్తలకు నోటీసులు జారీ చేశారని దీప్కే తెలిపారు. ఢిల్లీ ప్రయాణానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో సమాధానం చెప్పాలని కూడా పోలీసులు ప్రశ్నించారని ఆయన వెల్లడించారు.  

"హింస జరుగుతుందని పోలీసులకు ముందే ఎలా తెలుసు?":   
పోలీసులు జారీ చేసిన నోటీసులో  "అనుమతి లేకుండా నిరసనలో పాల్గొనవద్దు, హింసాత్మక ప్రచారాలు లేదా పోస్టులు పెట్టవద్దు, ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయి" అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన దీప్కే, "మేము గాంధీ, అంబేడ్కర్ ఆశయాల గురించి మాట్లాడేవాళ్ళం. అసలు ఈ ఆందోళన హింసాత్మకంగా మారుతుందని పోలీసులకు ముందే ఎలా తెలుసు ? వారేమైనా ప్లాన్ చేస్తున్నారా ?" అని ప్రశ్నించారు.  

రాజకీయ దుర్వినియోగంపై విమర్శలు:
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన రాజకీయ స్వార్థం కోసం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. “మహారాష్ట్ర పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకమైనవారు. కానీ ఫడ్నవిస్ సాహెబ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 2.0 లాగా మారడానికి ప్రయత్నిస్తూ పోలీసులను అవమానిస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అరెస్టుకు సిద్ధం:   
కార్యకర్తలను వేధించడం మాని, ధైర్యముంటే తననే అరెస్టు చేయాలని సవాలు విసిరారు. "నన్ను జైల్లో పెట్టినా, UAPA లేదా NSA వంటి కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసినా భయపడేది లేదు. నన్ను ఎక్కడ ఆపితే ఆ ప్రదేశాన్నే 'జంతర్ మంతర్'గా మార్చేసి ఆందోళన కొనసాగిస్తాం" అని స్పష్టం చేశారు.