అధిక లాభాలు ఆశ చూపి రూ.కోట్లలో మోసం .. జహీరాబాద్ పోలీసులు నలుగురిపై కేసు నమోదు

అధిక లాభాలు ఆశ చూపి రూ.కోట్లలో మోసం .. జహీరాబాద్ పోలీసులు నలుగురిపై కేసు నమోదు

జహీరాబాద్, వెలుగు : గోల్డ్, సిల్వర్ లో పెట్టుబడులు పెడితే  అధిక లాభాలు వస్తాయని నమ్మించి కోట్ల రూపాయలు కాజేసిన నలుగురిపై జహీరాబాద్​ పోలీసులు కేసు నమోదు చేసి శనివారం రిమాండ్ కు తరలించారు. 

జహీరాబాద్ పట్టణ సీఐ  రవి, ఎస్సై లవ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి చెందిన మిరుదొడ్డి ఇజ్రాయిల్ అలియాస్ బాబి, కొత్త శశిధర్ రెడ్డి, నాగరి గారి విల్లి ఫ్రాన్సిస్, పోతురాజు అరవింద్ తోపాటు మరో 22 మంది గత రెండేండ్లుగా హైదరాబాద్​కు చెందిన నైకి ట్రేడింగ్ కంపెనీలో రూ.28,14,57,128 పెట్టుబడులు పెట్టారు. 

మొదట కొంతకాలం పాటు పెట్టుబడులపై వడ్డీ చెల్లించిన నైకీ సంస్థ నిర్వాహకులు గోల్డ్, సిల్వర్  లో పెట్టుబడులు పెడితే అధిక లాభం వస్తాయని నమ్మించారు. దీంతో వారు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. సంవత్సరకాలం గడుస్తున్నప్పటికీ పెట్టుబడులపై ఎలాంటి లాభం ఇవ్వకపోవడంతో పెట్టుబడిదారులకు అనుమానం కలిగింది. 

తమను నమ్మించి  మోసగించారని మిరుదొడ్డి ఇజ్రాయిల్ అలియాస్ బాబి, కొత్త శశిధర్ రెడ్డి జహీరాబాద్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు నైకీ సంస్థ ప్రతినిధులైన మల్లెం శేషువర్ధన్ రెడ్డి, బగ్గి రవీంద్రబాబు, దేవుల జగదీశ్, పిండి సుస్మితను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.