2029కి ముందే నషా ముక్త్ తెలంగాణ: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

2029కి ముందే నషా ముక్త్ తెలంగాణ: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

మెదక్/రామాయంపేట, వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్​షా 2029 నాటికి దేశాన్ని మాదకద్రవ్య రహితంగా తయారు చేయాలని నిర్ణయించారని గవర్నర్​ శివ ప్రతాప్​ శుక్లా అన్నారు. కానీ, అంతకుముందే నషా ముక్త్​ తెలంగాణ సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రగ్స్‎కు నో.. జీవితానికి ఎస్​ చెప్పాలని విద్యార్థులు, యువతకు పిలుపునిచ్చారు. 

మంగళవారం మెదక్ కలెక్టరేట్​లో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్ రావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుతో కలిసి హాజరయ్యారు. వీరికి కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు ఘనస్వాగతం పలికారు. 

కలెక్టరేట్ నుంచి డిగ్రీ కళాశాల వరకు చేపట్టిన ర్యాలీని గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. నషా ముక్త్​ భారత్ పోస్టర్ రిలీజ్​ చేశారు. సెల్ఫీ పాయింట్ వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్ రావుతో కలిసి సంతకం చేసి సెల్ఫీ దిగారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన రెడ్ క్రాస్​ సొసైటీ బాధ్యులను అభినందించారు.

 గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సెల్ఫ్​హెల్ప్​గ్రూప్ ​ మహిళలు  ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం రామాయంపేట నుంచి సిద్దిపేట వరకు నేషనల్ హైవే  వెంట 35 వేల జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఒప్పించి వాహనదారులు, బాటసారుల కోసం నేషనల్ హైవే వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.  

‘నషా ముక్త్ భారత్’లో భాగస్వాములవ్వండి 

నషా ముక్త్ భారత్ ఉద్యమంలో పౌరులందరూ భాగస్వాములవ్వాలి. డ్రగ్స్​ముఠాలు యువత, విద్యార్థులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. డ్రగ్స్​కు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఒక వ్యక్తి మత్తు పదార్థాల బారిన పడితే దాని ప్రభావం అతనితోపాటు కుటుంబం, సమాజంపై పడుతుంది. గతంలో కేంద్ర మంత్రిగా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌‌‌‌గా విశేష సేవలందించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా.. హిమాచల్ ప్రదేశ్‌‌‌‌లో డ్రగ్స్​నిర్మూలనకు కృషి చేశారు. మన రాష్ట్రంలోనూ ఆయన చొరవతో నషా ముక్త్ భారత్ ఉద్యమం ముందుకెళ్తుంది. -మంత్రి వివేక్ వెంకటస్వామి