- సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
- కేంద్రం తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
కోహెడ, వెలుగు : ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరుడికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, దాన్ని కాలరాయాలని చూస్తే ఊరుకోబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని పరివేద, నకిరేకొమ్ముల, శ్రీరాములపల్లి, చెంచల్ చెరువుపల్లి, కాచాపూర్, మైసంపల్లి గ్రామాల్లో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న.. పల్లె పల్లెలో ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ పేరిట గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించకుండా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు ఈసీ అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ఈసీ వైఖరిని ఎండగడుతున్నా మోదీ సర్కారు మాత్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఒక రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రతి ఓటరు హక్కును కాపాడేందుకు ‘దేశ్ బచావో.. ఓట్ బచావో’ పేరిట పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఏంసీ చైర్ పర్సన్ నిర్మల, వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, మంద ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.
