భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) దాదాపు మూడున్నర ఏళ్ల తర్వాత (2023 ఫిబ్రవరి తర్వాత తొలిసారిగా) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25%) పెంచింది. దింతో మన దేశంలో పాలసీ వడ్డీ రేటు 5.25% నుంచి 5.50%కి చేరింది.
మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ముగిశాక, ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ నిర్ణయాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది.
అసలు రెపో రేటు అంటే ఏమిటి?
రెపో రేటు అనేది ఆర్‌బిఐ వాణిజ్య బ్యాంకులకు (SBI, HDFC, ICICI వంటివి) ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు. వడ్డీలు ఎలా పెరుగుతాయంటే.. ఆర్‌బిఐ దగ్గర బ్యాంకులు తీసుకునే అప్పులపై వడ్డీ పెరిగితే, బ్యాంకులు ఆ భారాన్ని కస్టమర్లపై వేస్తాయి. దింతో మీ గృహ రుణాలు (Home Loans), వాహన రుణాలు (Car Loans), పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. దీనివల్ల మీ ప్రతినెలా లోన్ EMI ఖర్చు పెరుగుతుంది లేదా లోన్ తీర్చే కాలపరిమితి పెరుగుతుంది.
రేపో రేటును ఆర్‌బిఐ ఎందుకు పెంచింది?
ఆగస్టు నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 4.82 శాతానికి పెరిగింది. మార్కెట్లో డబ్బు చలామణీ ఎక్కువగా ఉంటే ధరలు పెరుగుతాయి. కాబట్టి వడ్డీ రేట్లు పెంచి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలని ఆర్‌బిఐ భావించింది. అంతేకాకుండా పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)లో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది. ఇప్పటికే అమెరికా, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు వడ్డీ రేట్లను పెంచడంతో, భారత్‌లో కూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది.
భవిష్యత్తులో ఏం జరగవచ్చు?
గతంలో (2025 వరకు) ఆర్‌బిఐ వరుసగా 125 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించి, ఆ తర్వాత 5.25% వద్ద స్థిరంగా ఉంచింది. అయితే ప్రస్తుత గ్లోబల్ పరిస్థితుల దృష్ట్యా... భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం లేదని ఆర్‌బిఐ గవర్నర్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పరిస్థితులను బట్టి వడ్డీ రేట్లను ఇలాగే ఉంచడం లేదా ఇంకా పెంచడం మాత్రమే జరుగుతుందని సూచించారు.
