సిద్దిపేట రూరల్, వెలుగు: రెండు ఇండ్ల మ్యుటేషన్ కోసం లంచం డిమాండ్ చేసి, రూ. 15 వేలు తీసుకుంటూ సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామానికి చెందిన పంచాయతీ సెక్రటరీ బి. అరుణ, కారోబార్ దాసరి సంతోష్ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కారు.
జక్కాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన రెండు ఇండ్ల మ్యుటేషన్ కోసం పంచాయతీని సంప్రదించగా, అనుమతి మంజూరు చేయడానికి సెక్రటరీ, కారోబార్‌లు రూ. 20 వేల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు రూ. 15,000 ఇచ్చేందుకు అంగీకరించి ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. కాగా, మంగళవారం ఉదయం గ్రామ పంచాయతీలో వారిద్దరూ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
అచ్చంపేటలో సీనియర్ అకౌంటెంట్ అరెస్ట్
అచ్చంపేట : నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎస్టీవో (ట్రెజరీ) కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మెడికల్ లీవ్ పై వెళ్లి తిరిగి విధుల్లో చేరిన ఉద్యోగికి సంబంధించిన వైద్య సెలవు బిల్లులు, భత్యాల ప్రక్రియను పూర్తి చేసేందుకు సీనియర్ అకౌంటెంట్ కందాడ వెంకటయ్య రూ. 25 వేలు లంచం తీసుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని, హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.
కోరుట్ల ఆర్టీవో ఆఫీస్‌లో సోదాలు
కోరుట్ల : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని రవాణా శాఖ యూనిట్ ఆఫీస్‌లో మంగళవారం కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు లోపాలను గుర్తించి, సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుని నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
