కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై కేసు

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై కేసు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.  ఆకాశవాణి భవన్‎లోకి అనుమతి లేకుండా చొరబడ్డారన్న ఆరోపణల మేరకు రాహుల్, ప్రియాంకతో పాటు పలువురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కాగా, సర్ ప్రక్రియలో అవకతవకలు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష తీరును నిరసిస్తూ సేవ్ డెమొక్రసీ పేరుతో మంగళవారం (అక్టోబర్ 6) ఢిల్లీలోని ఈసీఐ ప్రధాన కార్యాలయ ముట్టడికి విపక్షాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ మకర్ ద్వార్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. విపక్షాల ర్యాలీకి అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆకాశవాణి భవన్‎లోకి ప్రవేశించి నిరసన తెలిపారు. సీఈసీని కలిసే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. 

పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని మరో చోటుకు తరలించారు. అయితే, అనుమతి లేకుండా ఆకాశవాణి భవన్ లోకి ప్రవేశించి ఆందోళన చేశారని రాహుల్, ప్రియాంక గాంధీపై ఆకాశవాణి భవన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకాశవాణి అధికారుల ఫిర్యాదు మేరకు రాహుల్, ప్రియాంకపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.