న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై ఆంక్షలు విధించాలని అమెరికా కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) చేసిన పిలుపును భారత్ తీవ్రంగా ఖండించింది. ఆ సంస్థ పక్షపాతంతో కూడినదని, దానికి ఎలాంటి విశ్వసనీయత లేదని తేల్చిచెప్పింది.
ఆర్ఎస్ఎస్పై ఆంక్షలు విధించాలని, అలాగే దాని నాయకులకు ఎలాంటి దౌత్యపరమైన మర్యాదలు ఇవ్వవద్దని కోరుతూ యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ ఉన్నతాధికారులు చేసిన డిమాండ్‌ను భారత్ తిరస్కరించింది. ఈమేరకు యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ ఒక పక్షపాత సంస్థగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అభివర్ణించారు. తన వీక్లీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘మనం ప్రస్తావిస్తున్న ఆ సంస్థ భారత్ గురించి ఎప్పుడూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే’ అని అన్నారు.
‘అది ఒక పక్షపాత సంస్థ. అలాంటి సంస్థలకు సొంత ఎజెండా ఉంటుందని, వాటికి ఎలాంటి విశ్వసనీయత ఉండదు కాబట్టి వాటికి దూరంగా ఉండాలని నేను చెబుతాను’ అని ఆయన పేర్కొన్నారు. యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ అధికారులు చేసిన వ్యాఖ్యలపై వచ్చిన ప్రశ్నకు జైస్వాల్ స్పందించారు.
ఆర్ఎస్ఎస్ అనేది మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలపై దాడులకు పాల్పడుతున్న ఉప-సమూహాలను కలిగిన ఒక గొడుగు లాంటి సంస్థగా యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ ఛైర్ ఆసిఫ్ మహమూద్ అన్నారు.
