న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పహల్గాం ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దాడికి మాస్టర్ మైండ్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కోర్టు సమన్లు పంపేందుకు సిద్ధమైంది. కేసు విచారణలో భాగంగా జమ్మూలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ముందు హాజరు కావాలని సయీద్‌కు న్యాయస్థానం సమన్లు జారీ చేయనుంది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ సమన్లను సయీద్‌కు పంపనున్నారు.
కాగా, పహల్గాం టెర్రర్ ఎటాక్ కేసులో ఇప్పటికే సయీద్‌కు ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్లో ఉండి భారత భూభాగంలో దాడులకు పాల్పడుతోన్న లష్కరే తోయిబా చీఫ్‌కు దౌత్య మార్గం ద్వారా చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మాస్టర్ స్కెచ్ వేసింది. ఈ దౌత్య సమన్ల ద్వారా అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచడమే భారత్ వ్యూహం.
2025, ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు చనిపోయారు. మొదట ఈ కేసును పహల్గామ్ పోలీసులు నమోదు చేయగా.. తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తును ఎన్ఐఏకు బదిలీ చేసింది. లోతుగా దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ ఈ దాడి వెనక లష్కరే తోయిబా దాని అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఉన్నట్లు తేల్చింది. ఈ మేరకు 2025, డిసెంబర్ 15న జమ్మూలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టులో ఎన్ఐఏ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇదే కేసులో 2026, జూలైలో ఎన్‌ఐఏ సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
ఇందులో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పేరును నిందితుడిగా చేర్చింది. ఆ తర్వాత జమ్మూ కోర్టు అతనిపై నాన్-బెయిలబుల్ (NBW) వారెంట్ జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా సయీద్‌కు ఎన్ఐఏ కోర్టు సమన్లు జారీ చేసింది. జమ్మూలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కావాలని సమన్లలో ఆదేశించింది. నిందితుడు నోటీసులకు స్పందించకుండా విచారణకు హాజరు కాకపోయినా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS)'లోని సెక్షన్ 356 ప్రకారం అతని గైర్హాజరులోనే విచారణను కొనసాగించి శిక్ష ఖరారు చేసేందుకు న్యాయస్థానం ప్రక్రియ ప్రారంభించనుంది.
