హైదరాబాద్ సిటీలోని గచ్చిబౌలి ఏరియా అంజయ్య నగర్. ఇక్కడ గజం స్థలం సైతం లక్షల్లో ఉంటుంది. అలాంటి ఏరియా ఇది. ఇక్కడ 50 గజాల స్థలంలో.. 7 అంతస్తుల భవనం నిర్మాణం చేపట్టారు. అది కూడా నాలా పక్కనే.. పెద్ద మురుగు కాలువను ఆనుకుని.. 50 గజాల స్థలంలో కడుతున్న 7 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. 2026, ఆగస్ట్ 22వ తేదీ మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో.. హైదరాబాద్ సిటీ ఉలిక్కిపడింది.
నిర్మాణంలో ఉన్న ఈ భవనం భారీ శబ్దంతో కుప్పకూలింది. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకోవటం కోసం రెస్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అక్రమంగా కడుతున్న ఈ భవనం కుప్పకూలటం ఒకటి అయితే.. ఆ చుట్టుపక్కల భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
భవనం కూలుతున్న సమయంలో.. ఆ శిథిలాలు చుట్టు పక్కల ఉన్న అపార్ట్ మెంట్లపై పడ్డాయి. వైట్ ఫీల్డ్ అనే అపార్ట్ మెంట్ 4వ అంతస్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. బిల్డింగ్ మధ్య ఖాళీ లేకపోవటం.. ప్రహరీగోడ ఆనుకుని నిర్మాణం చేపట్టటం.. ఈ క్రమంలోనే నిర్మాణంలోని భవనం కూలి.. పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ పై ఆ శిథిలాలు పడ్డాయి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు స్పాట్ కు చేరుకున్నాయి. పెద్ద కుప్పగా ఉన్న శిథిలాలు తొలగిస్తేనే.. ఈ కింద ఎవరు ఉన్నారా అనేది తెలుస్తుంది అంటున్నారు అధికారులు, స్థానికులు.
పెద్ద శబ్దంతో 7 అంతస్తుల భవనం కూలటంతో.. చుట్టుపక్కల అపార్ట్ మెంట్లలో ఉన్న స్థానికులు, ఆ పక్కనే ఉన్న హోస్టల్స్ లో ఉన్న వారు రోడ్డపైకి పరుగులు తీశారు.
గచ్చిబౌలి అంజయ్యనగర్ తోపాటు కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులోనూ ఇదే తరహాలో 5, 6, 7 అంతస్తుల్లో నిలువునా అపార్ట్ మెంట్స్ కట్టటం.. అందులో హాస్టల్స్ నిర్వహించటం కామన్ అయిపోయింది.
