UPI పేమెంట్లపై వ్యాపారులకు ఛార్జీలు కరెక్ట్ కాదు.. మళ్లీ క్యాష్ కింగ్ అవుతుంది: R.S. శర్మ

UPI పేమెంట్లపై వ్యాపారులకు ఛార్జీలు కరెక్ట్ కాదు.. మళ్లీ క్యాష్ కింగ్ అవుతుంది: R.S. శర్మ

దేశంలో డిజిటల్ విప్లవానికి ప్రతీకగా నిలిచిన UPI  భవిష్యత్తుపై నీలి నీడలు అలుముకుంటున్నాయి. యూపీఐ సేవలు వ్యాపారులు, వినియోగదారులకు పూర్తిగా ఉచితంగానే కొనసాగాలని, ప్రత్యేకంగా ఎలాంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ పేరుతో ఛార్జీలు రుద్దకూడదని ప్రముఖ నిపుణులు, UIDAI మాజీ డైరెక్టర్ జనరల్ ఆర్.ఎస్. శర్మ  వాదించారు. ఒకవేళ చిన్న లావాదేవీలపై కూడా ఛార్జీలు విధిస్తే.. దేశం మళ్లీ క్యాష్ లావాదేవీల వైపు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఛార్జీలు ఎందుకు యూపీఐకి సరిపోదు?
ట్యాక్సేషన్ లాస్ (సవరణ) బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ చట్టంలో మార్పులు చేస్తూ భవిష్యత్తులో కొన్ని చెల్లింపు విధానాలపై ఛార్జీలు విధించే వెసులుబాటును ప్రభుత్వానికి కల్పించింది. అయితే క్రెడిట్, డెబిట్ కార్డుల వ్యవస్థలో ఉన్న ఎండీఆర్ విధానం పూర్తిగా వేరు. కార్డుల లావాదేవీల్లో భౌతిక కార్డులు, స్వైపింగ్ మెషీన్లు, బ్యాంకులు, మధ్యవర్తి నెట్‌వర్క్‌ల నిర్వహణ ఖర్చులు ఉంటాయి.

కానీ.. యూపీఐ వ్యవస్థ ఇందుకు పూర్తి భిన్నమైనది. ఇది ఎలాంటి మధ్యవర్తులు లేకుండా సాధారణ ప్రొటోకాల్ ద్వారా నేరుగా ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరో బ్యాంక్ ఖాతాకు క్షణాల్లో నిధులను బదిలీ చేస్తుంది. దీనికి భారీ మౌలిక వసతుల ఖర్చు ఉండదు కాబట్టి.. కార్డుల లావాదేవీల లాజిక్ ఇక్కడ వర్తించదని నిపుణులు అంటున్నారు.

ALSO READ : విజన్ ప్రో, సిరి డిపార్ట్మెంట్లలో 200 మంది ఔట్!

చిన్న ఛార్జీ కూడా పెద్ద ప్రభావమే..
యూపీఐ లావాదేవీల భారీ పరిమాణాన్ని బట్టి చూస్తే.. అతి చిన్న ఛార్జీ కూడా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 2025-26లో యూపీఐ ద్వారా ఏకంగా 24 వేల కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ దాదాపు రూ. 314 లక్షల కోట్లుగా ఉంది. అంటే సగటు లావాదేవీ విలువ కేవలం రూ.13 వందలు మాత్రమే ఉండగా.. దాదాపు 86% వ్యాపార లావాదేవీలు రూ.500 లోపు ఉన్నవే.

ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపార లావాదేవీలపై కేవలం 0.3% ఛార్జీ విధించినా.. రిటైల్ రంగానికి ఏటా దాదాపు రూ.27వేల కోట్ల అదనపు భారం పడుతుందని శర్మ అన్నారు. ఈ భారాన్ని వ్యాపారులు కస్టమర్లపైకి నెట్టేస్తే.. వినియోగదారులు డిజిటల్ పేమెంట్స్ వైపు చూడటం మానేసి మళ్లీ క్యాష్ పేమెంట్స్‌కి మారతారని చెప్పారు. ఇది ఇప్పటివరకు సాధించిన డిజిటల్ పురోగతిని దెబ్బతీయటమే కాక.. భవిష్యత్తులో ఈ వ్యవస్థ ప్రజాధరణ లేక మరుగునపడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

అసలైన పరిష్కారం ఏమిటి?
డిజిటల్ పేమెంట్స్ వల్ల ప్రభుత్వానికి, బ్యాంకులకు భారీగా ఖర్చు ఆదా అవుతోందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. కేవలం కరెన్సీ నోట్ల ప్రింటింగ్, స్టోరేజీ, రవాణా నిమిత్తం ఆర్బీఐ ఏటా రూ.5వేల కోట్ల నుంచి రూ.6వేల 400 కోట్లు ఖర్చు చేస్తోంది. అలాగే బ్యాంకులు కూడా భౌతిక నగదు నిర్వహణ ఖర్చులను భారీగా తగ్గించుకుంటున్నాయి. దీనికి తోడు ఫేక్ కరెన్సీ అరికట్టడానికి అయ్యే ఖర్చులు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువగానే ఉన్నాయి. వీటికి అదనంగా పాడైన నోట్ల స్థానంలో కొత్త నోట్లు తీసుకురావటమూ తగ్గింది రిజర్వు బ్యాంకుకు డిజిటల్ పేమెంట్స్ వల్ల.

కాబట్టి వ్యాపారులు, వినియోగదారులపై ఛార్జీల రూపంలో భారం మోపకుండా.. డిజిటల్ చెల్లింపుల వల్ల ప్రభుత్వానికి బ్యాంకులకు కలుగుతున్న సేవింగ్స్ నుంచే యూపీఐ మౌలిక వసతులకు నిధులు కేటాయించాలి. ఒక పారదర్శకమైన విధానం ద్వారా ప్రభుత్వమే ఈ భారాన్ని భరించాలని ఆర్.ఎస్. శర్మ సూచిస్తున్నారు. లేనిపక్షంలో ఉచిత సేవలతో పుంజుకున్న డిజిటల్ ఇండియా ప్రయాణం మళ్లీ మొదటికే వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.