అమెరికా-కెనడా మధ్య ట్రేడ్ డీల్ చివరి నిమిషంలో విఫలమవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ పరిణామాలతో కెనడా నుంచి దిగుమతి అయ్యే బిలియన్ డాలర్ల కొద్దీ విలువైన వస్తువులపై ఏకంగా 50 శాతం దిగుమతి పన్ను విధించేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమైంది. శనివారం తెల్లవారుజామున 12:01 గంటల నుంచి ఈ కొత్త టారిఫ్ నిబంధనలు అమల్లోకి రానుండగా.. దీనివల్ల ప్లైవుడ్, లిక్కర్, ఎలక్ట్రికల్ పరికరాలు, హాకీ గేర్ వంటి వందలాది వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
గత ఏడాదిలో ఈ 2 మిత్రదేశాల మధ్య దాదాపు 900 బిలియన్ డాలర్ల విలువైన వస్తుసేవల ట్రేడ్ జరిగింది. ప్రస్తుతం ఈ ఒప్పందం బెడిసికొట్టడంతో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా స్టీల్, అల్యూమినియంపై సుంకాన్ని 25 శాతానికి, ఆటోమొబైల్స్ సుంకాన్ని 15 శాతానికి తగ్గించేలా ముసాయిదా ఒప్పందం సిద్ధమైనప్పటికీ.. బదులుగా కెనడా తన ప్రతిచర్య సుంకాలను ఎత్తివేయాలని అమెరికా కోరింది. అయితే కెనడా వైపు నుంచి అమెరికా కోరిన విధంగా డీల్ ఫైనల్ చేసుకునేందుకు నిరాకరణ రావటంతో చర్చలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఎలాంటి కొత్త చర్చలు షెడ్యూల్ చేయలేదని అమెరికా అధికారులు స్పష్టం చేశారు.
ALSO READ : రూ.75 లక్షలు ఇస్తున్న పాత కంపెనీలోనే ఉండాలా..
ఈ వాణిజ్య ఘర్షణతో పాటు కెనటాను అమెరికాలో ఒక రాష్ట్రంగా మారుస్తానని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం, కెనడా ప్రధానిని గవర్నర్ అని సంబోధించడం వంటి వివాదాస్పద ప్రకటనలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ టారిఫ్ పెంపు ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
