తమిళనాడులో ఆర్థిక సంక్షోభం: ఒక్క నెలలోనే రూ.12వేల కోట్లు అప్పు చేసిన విజయ్ సర్కార్

తమిళనాడులో ఆర్థిక సంక్షోభం: ఒక్క నెలలోనే రూ.12వేల కోట్లు అప్పు చేసిన విజయ్ సర్కార్

తమిళనాడులో హీరో విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది. సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం భారీగా అప్పుల బాట పట్టడం ఇప్పుడు రాజకీయంగా, ఆర్థికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం సార్ ప్రకటించిన ఉచిత కార్లు, అలవెన్స్ కూడా ప్రతిపక్షాలు ఇదే అప్పుల భారాన్ని చూపిస్తూ నిరాకరించటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లో టీవీకే సర్కార్ రాబడిని మించిపోయింది. జూలై ఒక్క నెలలోనే తమిళనాడు ప్రభుత్వం బాండ్ల జారీ ద్వారా ఏకంగా రూ.12వేల 044 కోట్లు అప్పులు చేయాల్సి వచ్చింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టిన 100 రోజుల్లోనే ఈ స్థాయిలో అప్పులు చేసిన విషయం బయటకు రావటంతో పెద్ద చర్చ కొనసాగుతోంది.

ఆదాయం ఎటు నుంచి వస్తోంది?
ఏప్రిల్ నుండి జూలై మధ్య కాలంలో తమిళనాడు మొత్తం రూ.89వేల 718 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో పన్నుల రూపంలోనే రూ.82వేల 566 కోట్లు రాగా, నాన్-ట్యాక్స్ ఆదాయం రూ.4వేల 070 కోట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు రూ.3వేల 082 కోట్లుగా నమోదయ్యాయి. రాష్ట్ర జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, వాణిజ్య పన్నులు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి.

భారీగా పెరుగుతున్న వ్యయం..
మరోవైపు అదే 4 నెలల్లో ప్రభుత్వ మొత్తం ఖర్చు రూ.లక్షా 23వేల కోట్లకు తాకింది. దీనివల్ల రాష్ట్రానికి రూ.25వేల 267 కోట్ల భారీ రెవెన్యూ లోటు ఏర్పడింది. పాత అప్పులపై వడ్డీ చెల్లింపులకే రూ.21వేల 176 కోట్లు ఖర్చు కాగా, పింఛన్ల కోసం మరో రూ.17వేల 237 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి రావడంతో తమిళనాడు ప్రభుత్వం మార్కెట్ అప్పులపై పూర్తిగా ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై వరకు మొత్తం అప్పులు రూ.32వేల 925 కోట్లకు చేరింది. కేవలం జూలై నెలలోనే రూ.12వేల 044 కోట్ల కొత్త అప్పులు చేరడంతో రాష్ట్రంపై రుణ భారం అంతకంతకూ పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం మెరుగుపడినప్పటికీ.. అదే స్థాయిలో ఖర్చులు, అప్పులు కూడా విపరీతంగా పెరగడం కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే.. మరోవైపు రుణాలు, వడ్డీ భారాలను ఎలా నియంత్రిస్తుందనే దానిపై ఇప్పుడు ఆర్థిక విశ్లేషణ జరుగుతోంది టీవీకే సర్కార్ పై. దీంతో ఆదాయాలను పెంచేందుకు కొత్త మార్గాలను వెతకటంపై విజయ్ సర్కార్ ఫోకస్ పెట్టక తప్పని నిపుణులు అంటున్నారు. అంతిమంగా అది ప్రజలపైనే భారంగా మారొచ్చని వారు అంటున్నారు పన్నుల రూపంలో.