కిచెన్‌లో చనిపోయిన బొద్దింకలు, ఈగలు, అపరిశుభ్రత.. ముంబై మెక్‌డొనాల్డ్స్‌తో సహా 13 హోటళ్ల లైసెన్సులు రద్దు చేసిన ఎఫ్‌డీఏ!

కిచెన్‌లో చనిపోయిన బొద్దింకలు, ఈగలు, అపరిశుభ్రత.. ముంబై మెక్‌డొనాల్డ్స్‌తో సహా 13 హోటళ్ల  లైసెన్సులు రద్దు చేసిన  ఎఫ్‌డీఏ!

ముంబైలోని ప్రముఖ క్లబ్‌లు, రెస్టారెంట్లు సహా  మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించినందుకు మహారాష్ట్ర ఆహార &  ఔషధ పరిపాలన (FDA) అధికారులు కొరడా ఝులిపించారు. పారిశుధ్య లోపాలు, అపరిశుభ్రత కారణంగా ముంబై రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 సంస్థల లైసెన్సులను రద్దు చేసారు. 

FDA తనిఖీల్లో వెలుగుచూసిన అంశాలు:
దక్షిణ ముంబై రేడియో క్లబ్ లో వంటగదిలో ఈగలు, చనిపోయిన బొద్దింకలు, పైకప్పు నుంచి ఊడిపోతున్న ప్లాస్టర్, నేరుగా నేలపై ఉంచిన ఆహార పదార్థాలు కనుగొన్నారు. అంతేకాకుండా, వంటపొయ్యి దగ్గర  చెత్తబుట్టలు ఉంచడం, రసాయనాలను ఆహారానికి దగ్గరగా నిల్వ చేయడం వల్ల లైసెన్స్ రద్దు చేశారు.

కొలాబా మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్: గతంలో ఇచ్చిన హెచ్చరికల్లోని 20 లోపాల్లో 18 సరిదిద్దకపోవడంతో తక్షణమే లైసెన్స్ రద్దు చేశారు. కిచెన్ నేలపై కుళ్ళిన వ్యర్థాలు, మురికి బట్టలతో ఆహారాన్ని తాకడం, 'రియల్ చీజ్' అని చెప్పి ప్రాసెస్ చేసిన 'గో చీజ్ సాస్' వాడటం వంటివి గుర్తించారు.

స్టేటస్ రెస్టారెంట్ (నారిమన్ పాయింట్): ఓ ఉద్యోగి ఆహార పాత్రల పైనే ముఖం కడుక్కోవడంతో పాటు తీవ్ర అపరిశుభ్రత కనిపించడంతో కస్టమర్ ఫిర్యాదు ఆధారంగా వెంటనే లైసెన్స్ సస్పెండ్ చేశారు.

ఖార్ జిమ్‌ఖానాలో సరిపోని నిల్వ, పచ్చి-వండిన ఆహారాన్ని కలిపి ఉంచడం, గిన్నెలు కడగడానికి వేడినీళ్లు లేకపోవడంతో రిజిస్ట్రేషన్‌ రద్దు చేసారు. 

వీటితో పాటు మలాడ్‌లోని నోవారా రెస్టారెంట్, సంతాపూర్‌లోని బజరంగ్ స్వీట్ మార్ట్‌లతో పాటు నాగ్‌పూర్, నాసిక్, అమరావతి, ఛత్రపతి సంభాజీనగర్‌లోని మరికొన్ని హోటళ్లు, బేకరీల లైసెన్సులను ఎఫ్‌డీఏ కొట్టేసింది. ఐఏఎస్ అధికారి తుకారాం ముండే ఎఫ్‌డీఏ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముమ్మరం చేసిన ఈ తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి.