ఆపిల్ లేఆఫ్స్: విజన్ ప్రో, సిరి డిపార్ట్మెంట్లలో 200 మంది ఔట్!

ఆపిల్ లేఆఫ్స్: విజన్ ప్రో, సిరి డిపార్ట్మెంట్లలో 200 మంది ఔట్!

అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ మరోసారి ఉద్యోగులకు షాకిచ్చింది. సిరి, విజన్ ప్రో ప్రాజెక్ట్‌లకు చెందిన 200 మందికి పైగా ఉద్యోగులను లేఆఫ్ చేసినట్లు వెల్లడించింది. ఈ తొలగింపులు టెక్ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఈ కోతల్లో విజన్ ప్రో ఆర్గనైజేషన్ నుంచి సుమారు 100 మంది, సిరి దాని సాఫ్ట్‌వేర్ గ్రూప్స్ నుంచి మరో 100 మంది ఉద్యోగులు ఎఫెక్ట్ అయ్యారట. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌లలో AI ఫీచర్లను అభివృద్ధి చేసే ఇంటెలిజెంట్ సిస్టమ్స్ ఎక్స్‌పీరియన్స్ టీమ్ కూడా ఈ లేఆఫ్స్ పరిధిలోకి రావడం గమనార్హం.

విజన్ ప్రో హెడ్‌సెట్ విభాగానికి ఈ లేఆఫ్స్‌లో గట్టి దెబ్బ తగిలింది. గేమింగ్ టీమ్‌ను పూర్తిగా మూసివేయడంతో పాటు, మిలియన్ల కొద్దీ ఖర్చయ్యే ఇమ్మర్సివ్ వీడియో కంటెంట్ ప్రొడక్షన్ టీమ్ ను ఆపిల్ కుదించింది. తక్కువ యూజర్ బేస్ కారణంగా ఖరీదైన వీడియోల తయారీని తగ్గించి, భవిష్యత్తులో బయటి స్టూడియోలపై ఆధారపడాలని నిర్ణయించుకుంది.

ఇక సిరి అసిస్టెంట్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కొత్త AI ఆర్కిటెక్చర్‌తో సిరిని పూర్తిగా పునర్నిర్మించే పనిలో ఉన్న ఆపిల్.. పాత నైపుణ్యాలకు స్వస్తి పలికి సరికొత్త ఇంజనీర్లను నియమించుకుంటోంది. రాబోయే పబ్లిక్ బీటా వెర్షన్ కోసం టెక్నాలజీని మారుస్తున్న క్రమంలోనే ఈ ఉద్యోగ మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మెుత్తానికి మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొందరు ఉద్యోగులను తొలగించటం కొత్తవారిని చేర్చుకోవటం అనే ఫార్ములాను ఐఫోన్ మేకర్ ఫాలో అవుతోంది. 

రూ.3 లక్షలకు పైగా ధర, తక్కువ రోజువారీ ఉపయోగం కారణంగా విజన్ ప్రో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆపిల్ తన వ్యూహాన్ని మారుస్తూ.. 2027 నాటికి స్మార్ట్ గ్లాసెస్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. కొత్త సీఈఓ జాన్ టెర్నస్ ఆధ్వర్యంలో ఆపిల్ భవిష్యత్ ప్లాన్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.