మల్కాజిగిరి భారీగా తుపాకులు.. రూ.కోటి 75లక్షల  హషీష్ ఆయిల్ సీజ్

 మల్కాజిగిరి భారీగా తుపాకులు.. రూ.కోటి 75లక్షల  హషీష్ ఆయిల్ సీజ్

హైదరాబాద్: మల్కాజిగిరి పోలీసుల చేపట్టిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతర్రాష్ట్ర స్థాయిలో అక్రమంగా రవాణా అవుతున్న ఆయుధాలు , భారీ ఎత్తున హషీష్ ఆయిల్ రాకెట్‌ను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. 

పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం అంతర్రాష్ట్ర ఆయుధాల అక్రమ రవాణాకు సంబంధించి ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి 2 నైన్ ఎంఎం (9mm) పిస్టల్స్, 3 మ్యాగజైన్లు, 17 లైవ్ రౌండ్లతో పాటు మరో డబుల్ బ్యారెల్ తుపాకీ, 2 లైవ్ రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఓటీ (SOT) మల్కాజిగిరి, బొల్లారం పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.

మరో కేసులో అంతర్రాష్ట్ర హషీష్ ఆయిల్ అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు హషీష్ ఆయిల్ పెడ్లర్లను అరెస్ట్ చేసి, వారి నుంచి దాదాపు 4 కిలోల హషీష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ హషీష్ ఆయిల్ మార్కెట్ విలువ సుమారు రూ. 1.75 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు , దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల వివరాలను కాసేపట్లో సీపీ సుమతి వెల్లడించనున్నారు.