- మాజీ మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట రూరల్, వెలుగు : రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్ చేశారు.
శనివారం పాలిటెక్నిక్ కాలేజ్ లను ఐటీఐలతో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సిద్దిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ రాజ్ గోపాల్ పేట్ రోడ్డు పై ధర్నా నిర్వహించారు. విద్యార్థులను చూసి ఆగిన ఆయన వారికి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఒక పాలిటెక్నిక్ విద్యార్థినేనని, ఆ చదువుల ప్రాముఖ్యత, విద్యార్థుల కష్టాలు తనకు బాగా తెలుసన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్నేండ్లవుతున్నా నేటికీ విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి లేడని, ఆ శాఖను సీఎం రేవంత్ రెడ్డే స్వయంగా చూస్తున్నా, విద్యార్థుల సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారన్నారు. జీవో 97 రద్దు చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశానని, అసెంబ్లీలో కూడా విద్యార్థుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. అనంతరం నంగునూర్ మండలం అక్కెన పల్లి మోడల్ స్కూల్ లో ‘మీ భవిష్యత్... మీ బాధ్యత’ అనే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర సర్కారు ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తోందని, కనీస వసతుల కల్పనలో, విద్యార్థుల యూనిఫాన్ బుక్స్ విషయం లో తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
రిఫైనరీ పనులు ప్రారంభించాలి
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ లో రిఫైనరీ పనులు వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం నంగునూరు మండలం నర్మేట గ్రామంలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని వారు సందర్శించారు. ప్రశాంత్ రెడ్డికి ఫ్యాక్టరీ నిర్మాణ పనులు, పామ్ ఆయిల్ తయారీ పై హరీశ్ రావు వివరించారు. సిద్దిపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అనతికాలంలోనే 60వెల మెట్రిక్ టన్నుల క్రషింగ్ చేసి అద్భుతమైన విజయం సాధించిందని, రైతులకు మంచి ఫలితాలు రావడం సంతోషం గా ఉందని ఆయన తెలిపారు.
