- లంగ్స్ నుంచి బ్లడ్ లోకి.. అక్కడి నుంచి నేరుగా బ్రెయిన్‌కు పాకుతున్న సూక్ష్మజీవి
- రోగనిరోధక శక్తికి దొరక్కుండా ‘టైటాన్ సెల్స్’ గా మారుతున్న వైనం
- గ్లూకోజ్, కాల్షియం సిగ్నల్స్‌తో మరింత బలంగా మారుతున్నట్లు గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: ఏటా వేలాది మంది ప్రాణాలు తీస్తున్న మెదడు వాపు వ్యాధి (క్రిప్టోకోకల్ మెనింజైటిస్) ఫంగస్ కు చెక్ పెట్టే సమయం దగ్గరపడింది. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థకు చిక్కకుండా, నేరుగా మెదడుపై దాడి చేసే 'క్రిప్టోకోకస్ నియోఫార్మన్స్' అనే కిల్లర్ ఫంగస్ అంతర్గత సీక్రెట్ ను హైదరాబాద్ లోని సీఎస్‌ఐఆర్-–సీసీఎంబీ సైంటిస్టులు బయటపెట్టారు. ఈ ఫంగస్ శరీరంలోకి చేరాక ఎలా బలపడుతుంది? మెదడుకు ఎలా పాకుతుంది? అనే రహస్యాలను సీసీఎంబీ రీసెర్చర్ డాక్టర్ శ్రీరామ్ వరహన్ నేతృత్వంలోని రీసెర్చ్ టీమ్ కనిపెట్టింది. ఈ రీసెర్చ్ తో మెదడువాపు వ్యాధికి కొత్త మందులు తయారు చేసేందుకు మార్గం సుగమమైంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.5 లక్షల మందికి పైగా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. భారత్ లోనూ వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి ఐదుగురు ఎయిడ్స్ రోగుల మరణాల్లో ఒకరికి మెదడువాపు వ్యాధే కారణమవుతోంది.
క్రిప్టోకోకస్ అత్యంత ప్రమాదకర ఫంగస్
శరీరం లోపలికి పాకే ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లలో ఇవి వేగంగా వ్యాపించి ప్రాణాలు తీస్తున్నాయి. వీటిని తగ్గించేందుకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మందులు చాలా తక్కువ. ఉన్నవాటితో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. మరోవైపు ఈ ఫంగస్ లు మందులకు కూడా లొంగకుండా మొండిగా తయారవుతున్నాయి. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసరంగా రీసెర్చ్ చేయాల్సిన లిస్టులో 'క్రిప్టోకోకస్ నియోఫార్మన్స్'ను చేర్చింది. మామూలు ఫంగస్ లు చర్మం వరకే పరిమితమైతే.. ఈ క్రిప్టోకోకస్ గాలి ద్వారా మొదట ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. అక్కడ ఇన్ఫెక్షన్ మొదలై, ఆ తర్వాత రక్తం ద్వారా నేరుగా మెదడుకు పాకుతుంది. అక్కడ మెదడు, వెన్నుపాము చుట్టూ ఉండే పొరలను దెబ్బతీసి 'క్రిప్టోకోకల్ మెనింజైటిస్' అనే మెదడు పొరల వాపుకు కారణమవుతుంది. ఈ పొరల వాపు ముదిరితే మెదడు కణాలవాపు జరిగి మెదడువాపు వ్యాధికి దారి తీస్తుంది.
ఇమ్యూనిటీకి చిక్కకుండా టాటాన్ సెల్స్ గా మార్పు...
ఈ ఫంగస్ కు ఉన్న అతిపెద్ద బలం తన రూపాన్ని మార్చుకోవడమే. ఊపిరితిత్తుల్లోకి చేరేటప్పుడు ఇది చాలా చిన్న మైక్రో సైజులో ఉంటుంది. కానీ శరీరంలోకి వెళ్లగానే కొన్ని కణాలు అమాంతం పెద్దవిగా మారి ‘టైటాన్ సెల్స్’గా రూపాంతరం చెందుతాయి. మన శరీరంలోని రోగనిరోధక కణాలు.. రోగకారక క్రిములను చంపేస్తాయి. కానీ ఈ టైటాన్ సెల్స్ చాలా పెద్దగా ఉండటంతో మన తెల్ల రక్తకణాలు వీటిని చంపలేవు. దాంతో ఇమ్యూనిటీ దాడి నుంచి ఈజీగా తప్పించుకుని, రక్తంలో కలిసి మెదడుకు చేరి మెనింజైటిస్ తెస్తుంది. ఫంగస్ పెద్ద సైజులోకి ఎలా మారుతుందనేది సైంటిస్టులకు అర్థం కాలేదు.
20 ఏండ్ల మిస్టరీ వీడింది
ఈ 20 ఏళ్ల మిస్టరీకి హైదరాబాద్ సీసీఎంబీ సైంటిస్టులు చెక్ పెట్టారు. ఫంగస్ లోని గ్లూకోజ్ మెటబాలిజం దాని కణాల్లో కాల్షియం స్థాయిలను సరిగ్గా ఉంచుతుందని గుర్తించారు. ఈ కాల్షియం ఫంగస్ లోపల ఉండే ‘కాల్సినూరిన్’ అనే కీలకమైన సిగ్నలింగ్ వ్యవస్థను ఆన్ చేస్తుంది. దీనివల్లే ఫంగస్ మన శరీరంలోని ఒత్తిడిని తట్టుకుని, మరింత ప్రమాదకరమైన ‘టైటాన్ సెల్స్’గా మారుతుందని తేలింది.
కొత్త మందుల తయారీకి బాటలు...
ఈ కొత్త ఆవిష్కరణ మెదడువాపు వ్యాధి చికిత్స లో పెద్ద మార్పునకు దారితీయనుంది. ఫంగస్ ను నేరుగా చంపేందుకు ప్రయత్నించడం కంటే అది 'టైటాన్ సెల్స్'గా మారకుండా అడ్డుకునే కొత్త తరం మందులను తయారు చేయవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఫంగస్ తన టైటాన్ రూపాన్ని ఎత్తకుండా ఆపితే అది చాలా బలహీనపడుతుంది. అప్పుడు మన శరీరంలోని రోగనిరోధక శక్తే ఆ ఫంగస్ ను మెదడుకు చేరకుండా సులభంగా నాశనం చేస్తుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో ప్రాణాంతక మెదడువాపు మరణాలను భారీగా తగ్గించవచ్చని పరిశోధకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
