జనగణనలో కులగణన చేపట్టండి..కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీసీ కమిషన్ చైర్మన్ లేఖ

జనగణనలో కులగణన చేపట్టండి..కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీసీ కమిషన్ చైర్మన్ లేఖ

హైదరాబాద్, వెలుగు: జనగణన ప్రక్రియలో భాగంగా కులాల వారీగా కూడా వివరాలు సేకరించాలని శనివారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీలతో సమానంగా బీసీ కులగణనను కూడా తప్పనిసరి చేయాలని కోరారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల వివరాలు సేకరించడానికి రాజ్యాంగపరమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, బీసీ, ఓబీసీల విషయంలో ఎలాంటి నిబంధనలు లేవని నిరంజన్ గుర్తుచేశారు.

గతంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు, రాబోయే జనగణనలో ఓబీసీ, ఎస్ఈబీసీ వర్గాల కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం అందించడానికి, పక్కా ఆధారాలతో కూడిన రిజర్వేషన్లు, విద్య, ఉపాధి, సంక్షేమ పథకాల రూపకల్పనకు ఓబీసీల విశ్వసనీయమైన కులాల వారీ గణాంకాలు అత్యంత కీలకమని చైర్మన్ స్పష్టం చేశారు.