పంజాబ్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్ ఫిర్యాదు
చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భార్య గుర్‌ప్రీత్ కౌర్ చుట్టూ భారీ వివాదం ముసురుకుంది. ఓ అత్యాచారం కేసును తొక్కిపెట్టేందుకు ఆమె రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పందించింది.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, రెండు వారాల్లోగా నివేదిక (ఏటీఆర్) సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి అధికారిక ఫిర్యాదు చేశారు. ఓ అత్యాచారం కేసుకు సంబంధించిన వ్యవహారంలో గుర్‌ప్రీత్ కౌర్ భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేసి కేసును మూసివేసేందుకు ప్రయత్నించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీన్ని పరిగణనలోకి తీసుకున్న కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కానూంగో నేతృత్వంలోని బెంచ్.. రాష్ట్ర యంత్రాంగానికి నోటీసులు జారీ చేసింది.
కేంద్ర హోం శాఖ దృష్టికి వ్యవహారం..
మహిళల భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో.. ఈ వ్యవహారాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘మహిళా భద్రతా విభాగం’ దృష్టికి కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సీ తీసుకెళ్లింది. రాష్ట్ర అధికారులు సమర్పించే విచారణ నివేదికను పరిశీలించిన అనంతరమే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నట్టు కమిషన్ స్పష్టం చేసింది.
ప్రస్తుతానికి ఈ ఆరోపణలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, నిజానిజాలు తేలాల్సి ఉందని అధికారులు చెప్పారు. అయితే సీఎం కుటుంబంపైనే నేరుగా ఈ స్థాయి ఆరోపణలు రావడం పంజాబ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
- మాజీ జడ్జికి లీగల్ నోటీసు
తనపై వచ్చిన ఆరోపణలపై డాక్టర్ గురుప్రీత్ కౌర్ తీవ్రంగా స్పందించారు. పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తికి ఆమె శనివారం లీగల్ నోటీసులు పంపించారు. నోటీసు అందిన 24 గంటల్లోగా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని, లేకుంటే న్యాయపరమైన చర్యలు చేపడతామని నోటీసులో హెచ్చరించినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వర్గాలు వెల్లడించాయి.
కాగా, ఈ ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, సీఎం భగవంత్ మాన్ వెంటనే దీనిపై రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వాలని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ డిమాండ్ చేశారు.
