- క్లోర్ఫెనిరామైన్ మలేట్+ ఫెనైల్ ఎఫ్రిన్ కాంబినేషన్ మందులు వేయొద్దని కేంద్రం సూచన
- మందుల ప్యాకెట్లపై హెచ్చరిక ముద్రించాల్సిందేనని ఫార్మా కంపెనీలకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలుబు, అలర్జీల నివారణకు ఎక్కువగా వాడే క్లోర్ ఫెనిరామైన్ మలేట్ + ఫెనైల్ ఎఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ మందుల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ విషయంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. 4 ఏండ్లలోపు వయసున్న పిల్లలకు ఈ కాంబినేషన్ మందులను వాడకూడదని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే, ఈ కాంబినేషన్ మందులను తయారు చేసే కంపెనీలు తమ ప్యాకింగ్‌లు, లేబుల్స్‌పై ‘4 ఏండ్లలోపు వయసున్న చిన్నారులకు ఈ ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ మందును ఉపయోగించకూడదు’ అనే హెచ్చరికను కచ్చితంగా ముద్రించాలని కేంద్రం ఆదేశించింది. గతంలో కొన్ని ఫార్ములేషన్లకే పరిమితమైన ఈ నిబంధనను, ఇప్పుడు ఈ కాంబినేషన్‌తో తయారయ్యే అన్ని రకాల మందులకు వర్తింపజేస్తూ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940లోని సెక్షన్ 26ఏ కింద ఈ నిర్ణయం తీసుకుంది.
నిపుణుల కమిటీ సూచనతోనే..
చిన్నారుల్లో ఈ మందుల వాడకం వల్ల కొన్ని రకాల రిస్క్‌లు ఉన్నాయని, వీటికి బదులుగా సురక్షితమైన ఇతర ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర నిపుణుల కమిటీ, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు అభిప్రాయపడింది. ఈ కమిటీల సిఫార్సుల మేరకు ప్రజారోగ్యం దృష్ట్యా ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కొత్త నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
