ఒక చేతిలో పుస్తకం.. మరో చేతిలో కూరగాయల బుట్ట ! ఇటు చదువుకుంటూనే అటు ఖాళీ సమయంలో కలుపు తీస్తూ, మొక్కలకు నీళ్లు పడుతూ మురిసిపోతున్నారు. తమకు కావాల్సిన కూరగాయలను సేంద్రియ పద్ధతిలో పండించుకొని మధ్యాహ్నభోజనాన్ని మరింత రుచికరంగా మార్చుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్సి ప్రాథమిక పాఠశాల ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నది. 2009కు ముందు ఈ సర్కారు బడి కూడా అన్ని స్కూళ్లలాగే ఉండేది. కానీ, 2009లో ఉపాధ్యాయుడు సురేందర్ బదిలీపై ఇక్కడి వచ్చాక క్రమంగా పరిస్థితి మారింది. విద్యార్థుల్లో హిమోగ్లోబిన్, పోషకాహార లోపాలను గుర్తించిన టీచర్, వారికి ఎలాగైనా మంచి భోజనం అందించాలనే ఉద్దేశంతో సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు ప్రారంభించారు. విద్యార్థుల సాయంతో పదేండ్లుగా టమాటా, వంకాయ, చిక్కుడు, అలసంద, బీర, సొరకాయ వంటి కూరగాయలతో పాటు తోటకూర, పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలు పండిస్తున్నారు. ఇవే కూరగాయలతో మధ్యాహ్నం భోజనం వండించడం వల్ల పిల్లల ఆరోగ్యం మెరుగుపడింది. అంతేనా పాఠశాల ప్రాంగణంలోనే జామ, తోట, నిమ్మ చెట్లు కూడా పెంచారు. ఈ పండ్లను కూడా కోసి విద్యార్థులకు అందజేస్తున్నారు.
-బడల కిరణ్కుమార్
(వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్)
