మంచిర్యాల/నస్పూర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 22ఏ నిషేధిత భూముల జాబితాలో జరిగిన అక్రమాలు, తప్పిదాలకు బాధ్యత వహిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. 22ఏ భూములపై విచారణ జరిపించాలని, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాల కలెక్టర్కు మెమోరాండం అందించడానికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసుల తీరును నిరసిస్తూ వినతిపత్రాన్ని కలెక్టరేట్ గేటుకు కట్టి నిరసన వ్యక్తం చేశారు. రఘునాథ్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్న బీజేపీ నాయకులను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ జీవోల పేరిట ప్రజల భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జీవోలో జరిగిన తప్పిదాలపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు పి.పురుషోత్తం, ఎ.కృష్ణమూర్తి, వి.వెంకటేశ్వర్ రావు, ఎ.అశోకవర్ధన్, ఎ.రాజ్ కుమార్, కె.నాగరాజు, సత్యం, బి.ప్రవీణ్, రవి పాల్గొన్నారు.
