హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, పండుగలు, చరిత్రను తమ కెమెరాతో ప్రపంచానికి పరిచయం చేయాలనుకునే యువ ఫిల్మ్ మేకర్స్‌కు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) అవకాశం కల్పిస్తోంది. బతుకమ్మ పండుగ సందర్భంగా టీఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో ‘యంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్ 2026–సీజన్ 2’ నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, ఎండీ ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, టీఎఫ్‌డీసీ ఈడీ కిషోర్ బాబుతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలను ఇతివృత్తాలుగా తీసుకుని షార్ట్ ఫిల్మ్స్, పాటల పోటీలు నిర్వహించనున్నట్లు దిల్ రాజు తెలిపారు.
యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోటీల్లో ప్రథమ బహుమతిగా రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ.2 లక్షలు, తృతీయ బహుమతిగా రూ.లక్ష అందించనున్నారు. మరో ఐదుగురికి రూ.20 వేల చొప్పున కన్సొలేషన్ ప్రైజ్ ఇస్తారు. విజేతలకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేయనున్నారు. షార్ట్ ఫిల్మ్ నిడివి 3 నిమిషాలు, పాటల రన్‌టైమ్ 5 నిమిషాలకు మించకూడదు. వీడియోలు 4కే రిజల్యూషన్‌లో ఉండాలి. ఆసక్తి ఉన్నవారు తమ ఎంట్రీలను సెప్టెంబర్ 15, 2026లోపు youngfilmmakerschallenge@gmail.comకు లేదా 8125834009 నంబర్‌కు పంపాలని నిర్వాహకులు సూచించారు.
