న్యూఢిల్లీ: దేశ రాజధానిలో స్వైన్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో హెచ్1ఎన్1 కేసులు 1,777కి చేరాయి. గత సంవత్సరంతో పోలిస్తే కేసుల సంఖ్య 8 రెట్లు పెరిగింది. సాధారణంగా వర్షాకాలం మధ్యలో కనిపించే నిరంతర తేమ, అస్థిర వాతావరణ పరిస్థితుల వల్ల స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది.
అధిక జ్వరం, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, విరేచనాలు తదితర ఉదర సంబంధిత సమస్యలతో పాటు హెచ్1ఎన్1 స్వైన్ ఫ్లూ ఇన్‌ఫెక్షన్‌లతో ఎక్కువ మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారని డాక్టర్లు పేర్కొంటున్నారు. చాలా మంది రోగులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారని.. వారికి అదనపు ఆక్సిజన్ అవసరమవుతోందని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, లంగ్స్, హార్ట్ సమస్యలు ఉన్నవారు ఈ ముప్పు బారిన పడుతున్నారని వారు వెల్లడించారు.
