- అక్కడి విద్యా విధానాలపై 40 మంది సభ్యుల బృందం స్టడీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యాశాఖ అధికారుల బృందం సింగపూర్ వెళ్లనుంది. సెప్టెంబర్ 12న బయలుదేరనున్న ఈ బ్యాచ్1 టీమ్‌లో 11 మంది కీలక అధికారులతో కలిపి మొత్తం 40 మంది సభ్యులు ఉండనున్నారు. ఈ మేరకు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్, ఎంపికైన అధికారుల వివరాలతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 12 నుంచి 19వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ బృందం సింగపూర్‌లో పర్యటించనుంది.
అక్కడి విద్యా విధానాలపై అధ్యాయనం చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా విద్యా రంగంలో అమలవుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్ తెలుసుకునేందుకు సింగపూర్ తో పాటు ఫిన్లాండ్, వియత్నాం, జపాన్ దేశాల్లోనూ పర్యటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సింగపూర్ వెళ్లే మొదటి బ్యాచ్ అధికారులకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ పద్ధతిలో ఓరియంటేషన్ క్లాస్ నిర్వహించారు. వీసా ప్రాసెసింగ్, గైడ్ లైన్స్ పై ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. విదేశాల్లో అధ్యయనం చేసిన అంశాలను మన సర్కారు బడుల్లో ఏ విధంగా అమలు చేయవచ్చనే దానిపై ఈ బృందం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
