నేరేడ్మెట్, వెలుగు: బైక్‌పై అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను నాగోల్ పోలీసులు, ఎస్‌ఓటీ ఎల్‌బీ నగర్ టీమ్ అరెస్ట్‌చేశారు. వారి వద్ద నుంచి రూ.1.75 కోట్ల విలువైన 14.2 కిలోల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి సీపీ సుమతి మీడియా సమావేశంలో వెల్లడించారు. నాగోల్- గౌరెల్లి రోడ్డులో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహిస్తుండగా.. బైక్‌పై వెళ్తున్న నిందితులను ఆపి తనిఖీ చేయగా14 ప్యాకెట్లలో నల్లటి హాష్ ఆయిల్ లభ్యమైందన్నారు. నిందితులను అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన తల్లె నాగరాజు, నాగుల నారాయణ అలియాస్ కిరణ్‌లుగా గుర్తించినట్లు చెప్పారు.
ఒడిశా మల్కన్‌గిరి ప్రాంతానికి చెందిన తమర గోపాల్ అనే వ్యక్తి ఈ అక్రమ రవాణా వెనక ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. ఒడిశా సరిహద్దు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ చేరవేస్తే ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తానని గోపాల్ ఆశ చూపినట్లు నిందితులు అంగీకరించారన్నారు. ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
