హైదరాబాద్ ఐటీ కారిడార్ లో కుప్పకూలిన ఏడంతస్తుల బిల్డింగ్

హైదరాబాద్ ఐటీ కారిడార్ లో కుప్పకూలిన ఏడంతస్తుల బిల్డింగ్
  • 55 గజాల్లో 7 అంతస్తులు  కుప్పకూలిన బిల్డింగ్
  • ఇద్దరు మృతి.. గచ్చిబౌలి అంజయ్యనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఘటన 
  • శిథిలాల కింద మరికొందరు.. కొనసాగుతున్న సహాయక చర్యలు 
  • పక్క అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై శిథిలాలు పడి ఆర్మీ మాజీ ఉద్యోగి దంపతులకు తీవ్రగాయాలు 
  • పక్కనున్న మరో రెండు బిల్డింగులకు పగుళ్లు 
  • నాలా కబ్జా చేసి మరీ అక్రమ నిర్మాణం 
  • అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం: హైడ్రా కమిషనర్​

గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ ఐటీ కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. గచ్చిబౌలి అంజయ్యనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలాను ఆక్రమించి ఎలాంటి అనుతులు లేకుండా కేవలం 55 గజాల్లో చేపట్టిన 7 అంతస్తుల అక్రమ భవనం శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది. భవనంలో పని చేస్తున్న ఇద్దరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకొని దుర్మరణం చెందగా, వారి మృతదేహాలను బయటకు తీశారు. మృతులను మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఉమేశ్‌‌‌‌‌‌‌‌(34), మొహబ్బత్(42)గా గుర్తించారు. 


ఈ ఇంటిని సాజిద్ అనే బిల్డర్ నాలాను ఆక్రమించి మరీ కట్టినట్టుగా గుర్తించారు. కేవలం 55 గజాల స్థలంలోనే ఏడు అంతస్తుల భవనం నిర్మించగా, ప్రస్తుతం భవనంలో టైల్స్ పనులు సాగుతున్నాయి. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అగ్గిపెట్టెలు పేర్చినట్టుగా కట్టడంతో భవనం శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం గురించి తెలియగానే హైడ్రా డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని శిథిలాల తొలగింపు చేపట్టాయి.

శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకుపోయారని భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన పరిశీలించారు. కుప్పకూలిన భవనం శిథిలాలు పక్కనే ఉన్న వైట్​ఫీల్డ్‌‌ జయదర్శిని రెసిడెన్సీలోని సీ బ్లాక్ అపార్ట్‌‌మెంట్‌‌పై పడడంతో అందులో ఉంటున్న ఆర్మీ మాజీ ఉద్యోగి రమణారెడ్డి, ఆయన భార్య సంయుక్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో సీ బ్లాక్‌‌లోని ఐదు ఫ్లాట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముందుజాగ్రత్తగా సీ బ్లాక్‌‌లోని అన్ని ఫ్లాట్లనూ పోలీసులు ఖాళీ చేయించారు. కూలిన భవనానికి ఇరువైపులా ఉన్న మరో రెండు భవనాలకు కూడా పగుళ్లు ఏర్పడడంతో.. ఎప్పుడు కూలిపోతాయోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఆ రెండు భవనాల్లో హాస్టళ్లు కొనసాగుతుండగా, పోలీసులు వాటిని కూడా ఖాళీ
 చేయించారు. 

ముందే ఫిర్యాదు చేసినా పట్టించుకోలే.. 


బిల్డర్ సాజిద్ అంజయ్యనగర్‌‌‌‌లోనే 50, 60 గజాల స్థలాల్లోనే ఆరు, ఏడు అంతస్తుల బిల్డింగ్‌‌లు నిర్మించి హాస్టళ్లకు అద్దెకు ఇచ్చినట్టుగా స్థానికులు, జయదర్శిని రెసిడెన్సీ వాసులు చెప్తున్నారు. మొదట్లోనే అధికారులు చర్యలు తీసుకుంటే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా, గచ్చిబౌలి అంజయ్యనగర్, సిద్ధిక్​నగర్‌‌‌‌లలో హాస్టళ్లకు, రూమ్‌‌లకు డిమాండ్ భారీగా ఉంది. దీంతో యజమానులు అద్దె కోసం బరితెగిస్తున్నారు. బిల్డర్లతో కేవలం 50, 60 గజాల స్థలాల్లోనే ఆరు, ఏడు అంతస్తుల అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. గతంలో సిద్ధిక్​నగర్‌‌‌‌లో ఓ బిల్డింగ్ సెల్లార్ కోసం తవ్వుతుండగా, పక్కనే 60 గజాల్లో కట్టిన 5 అంతస్తుల భవనం ఒరిగిపోయింది. దానిని హైడ్రా అధికారులు యంత్రాలతో నేలమట్టం చేయించారు. ఆ తర్వాత అప్పటి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అక్రమ నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ నెల రోజుల పాటు అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసుల జారీతో సరిపెట్టారు. దీంతో ఇప్పుడైనా అక్రమ భవనాలపై చర్యలు ఉంటాయా? లేదా? అన్నదానిపై స్థానికుల్లో అనుమానాలు నెలకొన్నాయి. 

సీజ్ చేసినా.. పనులు చేస్తున్నారు: సీఎంసీ కమిషనర్ సృజన 

కూలిన భవనం నిర్మాణంలో ఉన్నప్పుడే తమకు ఫిర్యాదులు వచ్చాయని, నాలుగు నెలల క్రితమే నిర్మాణ పనులను నిలిపివేయించి, సీజ్ చేశామని సీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. బిల్డర్ శుక్రవారం నుంచి పనులను తిరిగి చేయిస్తున్నాడని, ఇంతలోనే భవనం కూలిందన్నారు. హైడ్రాతో క‌‌లిసి అన్ని భ‌‌వ‌‌నాల‌‌ను ప‌‌రిశీలించి, అక్రమ నిర్మాణాలను తొల‌‌గిస్తామ‌‌న్నారు. త్వరలోనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్మాణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అయితే, ఈ అక్రమ నిర్మాణాలను మొదట్లోనే గుర్తించి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిచంగా.. ఇద్దరు కమిషనర్లు మౌనం పాటించారు.