- వచ్చిన స్టాక్ కంటే ఎక్కువ బుకింగ్..షాప్ లకు వెళ్తే నో స్టాక్ అని సమాధానం
సిద్దిపేట, వెలుగు : తొగుట మండలం కాన్గల్ గ్రామానికి చెందిన రైతు నాయిని రాజు ఇటీవల వెంకట్రావుపేటలో నాలుగు బ్యాగుల యూరియా బుక్ చేశాడు. వెంటనే క్యూ ఆర్ కోడ్ జనరేట్ అయింది. దీంతో యూరియా కోసం గ్రామంలోని డీలర్ వద్దకు వెళ్లితే తన వద్ద స్టాక్ లేదని, సాంకేతిక సమస్య కారణంగా లో స్టాక్ పేరిట ఆన్ లైన్ లో అదనంగా యూరియా బుక్ అయిందని, మరోసారి బుక్ చేసుకుని రావాలని తిప్పి పంపాడు.
ఇది రైతు నాయిని రాజు ఒక్కడు ఎదుర్కొంటున్న సమస్య కాదు. కొద్ది రోజులుగా జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ఆధార్ సీడింగ్ ఆధారంగా తెచ్చిన యాప్ ద్వారా యూరియా బుక్ చేసేటప్పుడు పలువురు రైతులు ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
రైతులకు యూరియా సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం ఆధార్ సీడింగ్ ఆధారంగా ప్రవేశపెట్టిన ‘ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్’ కొత్త యాప్ తో చిక్కులు వస్తున్నాయి. ఉన్న స్టాక్ కంటే అదనంగా బుకింగ్ జరుగుతుండడం, షాప్ వద్దకు వెళ్తే యూరియా లేదని చెప్పడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
టెక్నికల్ సమస్యతో..
యాప్ లో టెక్నికల్ సమస్య కారణంగా డీలర్ వద్ద ఉన్న కోటా కంటే రెండు నుంచి మూడు వందల బస్తాలు అదనంగా ఉన్నట్లు డిస్ప్లే అవుతోంది. ఉదాహరణకు ఒక షాపునకు 560 బస్తాలు వస్తే, అదనంగా మరో 200 బస్తాలు ఉన్నట్లు చూపించి క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతోంది. దీంతో యూరియా దొరికిందన్న సంతోషంతో షాపులకు వెళ్లే రైతులకు ‘నో స్టాక్’ అనే సమాధానం ఎదురవుతోంది. ఈ సాంకేతిక సమస్యల వల్ల కొన్ని ప్రాంతాల్లో రైతులు, షాప్ యజమానుల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.
కాంప్లెక్స్ ఎరువుల బుకింగ్ లోనూ ఇదే సమస్య..
కేవలం యూరియానే కాకుండా కాంప్లెక్స్ ఎరువుల బుకింగ్ లోనూ ఇదే రకమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఎరువులు అందుబాటులో ఉన్నప్పటికీ సాంకేతిక లోపాల వల్ల క్యూఆర్ కోడ్ జనరేట్ కాకపోవడంతో రైతులు షాపుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్‌ల మధ్య సమన్వయ లోపం కారణంగా రాష్ట్ర ప్రభుత్వ యాప్‌లో వేగంగా అమ్మకాలు జరుగుతుంటే, కేంద్ర ప్రభుత్వ కొత్త యాప్‌లో మాత్రం సాంకేతిక సమస్యలతో ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.
కౌలు రైతుల పరిస్థితి దారుణం..
కేంద్ర ప్రభుత్వ కొత్త యాప్ నిబంధనల వల్ల కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. భూ యజమానులు విదేశాల్లో ఉన్నప్పుడు, ఆధార్ సీడింగ్ కారణంగా ఓటీపీలు లేదా మెసేజ్‌లు వారి ఫోన్లకు వెళ్తున్నాయి. విదేశాల్లో ఉండటం వల్ల వారు భారత్ నెంబర్లను బ్లాక్ చేసుకోవడం లేదా అందుబాటులో లేకపోవడంతో కౌలు రైతులకు యూరియా బుకింగ్ నిలిచిపోతోంది. ఈ నిస్సాహాయ పరిస్థితి కారణంగా భూములు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
సాంకేతిక లోపాలను సరిచేయాలి..
ఈ సమస్యను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి ఎరువుల యాప్‌లోని సాంకేతిక లోపాలను వెంటనే సరిచేయాలని రైతులు కోరుతున్నారు. క్యూఆర్ కోడ్ జనరేట్ అయిన ప్రతి రైతుకు ఎలాంటి జాప్యం లేకుండా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని, కౌలు రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
స్టాక్ లేదని తిప్పి పంపారు...
కేంద్ర ప్రభుత్వ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకుంటే సాంకేతిక కారణాల పేరిట స్టాక్ లేదని తిప్పి పంపారు. దీనిపై ఎవరిని ఆడగాలో అర్థం కావడం లేదు. అదనుకుగా యూరియా అందక పోతే పంటలు పాడై పోతాయి. ఈ విషయంలో అధికారులు తర్వగా స్పందించి సమస్య పరిష్కరించాలి.
- కాముని లక్ష్మీనారాయణ, రైతు, కాన్గల్
