- 13 మందికి పైగా గాయాలు, మరో ఇద్దరి పరిస్థితి విషమం
- కంపెనీ ఎదుట మూడు గ్రామాల ప్రజల ఆందోళన
- కంపెనీని సీజ్ చేసిన ఆఫీసర్లు
భూదాన్ పోచంపల్లి, వెలుగు : కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఇద్దరు కార్మికులు చనిపోగా, మరో 13 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని ధోతిగూడెం పరిధిలో ఉన్న హెజిలో పరిశ్రమలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి కార్మికులు రియాక్టర్ లో కెమికల్స్ లోడ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో రియాక్టర్ ఒక్కసారిగా పేలి మంటలు అంటుకున్నాయి. ప్రమాదంలో ఖమ్మం జిల్లా చౌడారం గ్రామానికి చెందిన నాగనబోయిన నరేశ్ కుమార్(29), నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చిన్నగూడెం గ్రామానికి చెందిన చెన్నూరు నాగిరెడ్డి(31) పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే చనిపోగా.. అదే బ్లాక్ లో పని చేస్తున్న మరో 13 మందికి గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన కంపెనీ యాజమాన్యం, తోటి కార్మికులు గాయపడిన వారిని హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన వారిలో రణబోతు రాజశేఖర్ రెడ్డి, శ్రీహరి మేధా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది, కంపెనీ యాజమాన్యం కలిసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రియాక్టర్ పేలిన శబ్ధానికి అంతమ్మగూడెం, ధోతిగూడెం గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
ప్రమాద సమాచారం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు కంపెనీ వద్దకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన బ్లాకులలో రియాక్టర్లను రిపేర్ చేసే వరకు కంపెనీని సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సోమ, మంగళవారాల్లో కంపెనీల యజమానులతో కలెక్టరేట్ లో మీటింగ్ నిర్వహించి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తామని చెప్పారు.
మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, గాయపడిన వారు కోలుకునే వరకు ట్రీట్ మెంట్ చేయించడంతో పాటు జీతాలు ఇవ్వాలని కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించారు. కాగా, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2.80 కోట్ల ఎక్స్ గ్రేషియా ఇచ్చినట్టు సమాచారం. బాధితుల కుటుంబాల నుంచి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు కానట్లు తెలుస్తోంది.
కంపెనీ ముందు గ్రామస్తుల ధర్నా
ప్రమాదకరంగా మారిన కంపెనీలను తమ గ్రామాల నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ ధోతిగూడెం, అంతమ్మగూడెం, జిబ్లక్ పల్లి గ్రామాల సర్పంచులు, ప్రజలు శనివారం హెజిలో కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. కంపెనీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
పోలీసులు గ్రామస్తులను వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా.. పలువురు పోలీసు వాహనం ఎదుట బైఠాయించారు. అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు ఘటనా స్థలానికి చేరుకొని కంపెనీని తాత్కాలికంగా సీజ్ చేస్తున్నామని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
