చదువుతోపాటు నైపుణ్యం..! గిరిజన డిగ్రీ విద్యార్థినులకు ఫ్రీగా ట్రైనింగ్

చదువుతోపాటు నైపుణ్యం..! గిరిజన డిగ్రీ విద్యార్థినులకు ఫ్రీగా ట్రైనింగ్
  •     గిరిజన డిగ్రీ విద్యార్థినులకు స్వయం ఉపాధి శిక్షణ
  •     ఎనిమిది రంగాల్లో ఉచితంగా ట్రైనింగ్ 
  •     రాష్ట్రంలోనే వినూత్న కార్యక్రమానికి 
  • ఖమ్మం గురుకుల కాలేజీ వేదిక
  •     ఉద్యోగాన్వేషణ నుంచి ఉపాధి ప్రదాతలుగా తీర్చిదిద్దే లక్ష్యం

ఖమ్మం/ కొణిజర్ల, వెలుగు: చదువుతో పాటు ఓ నైపుణ్యం, ఆ నైపుణ్యంతో సొంత ఉపాధి, అవసరమైతే మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం.. గిరిజన విద్యార్థినులను ఈ దిశగా తీర్చిదిద్దేందుకు ఖమ్మం తెలంగాణ గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే ఇలాంటి కార్యక్రమం చేపట్టిన తొలి డిగ్రీ కళాశాలగా ఖమ్మం నిలుస్తోంది. విద్యార్థినుల్లో వ్యాపార దృక్పథాన్ని పెంపొందిస్తూ టైలరింగ్‌‌‌‌‌‌‌‌, మగ్గం వర్క్, సౌందర్య సాధనాల తయారీ, ఆభరణాలు, సీడ్ పెన్నులు, తాటి ఆకుల బుట్టలు, బేకరీ ఉత్పత్తులు, అగరబత్తుల తయారీ వంటి ఎనిమిది రంగాల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. సత్యమార్గం ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీలక్ష్మి సహకారంతో ఒక్కో బ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 10 మంది చొప్పున విద్యార్థినులను ఎంపిక చేసి, ప్రాథమిక పరిజ్ఞానం నుంచి ఉత్పత్తుల తయారీ వరకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా శిక్షణ అందిస్తున్నారు. చదువుతో జ్ఞానం, నైపుణ్యంతో ఉపాధి.. రెండింటినీ సమన్వయం చేసి గిరిజన విద్యార్థినులను స్వావలంబన దిశగా నడిపిస్తున్న ఈ కార్యక్రమం రాష్ట్రంలోని మిగతా గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలకు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది.

ఉద్యోగార్థుల నుంచి ఉపాధి ప్రదాతలుగా..

డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా, అప్పటికే ఒక నైపుణ్యాన్ని సొంతం చేసుకుని దానిని ఉపాధిగా మలుచుకోవడమే కార్యక్రమం ఉద్దేశం. శిక్షణ పొందిన విద్యార్థినులు కుట్టుమెషీన్ కేంద్రం, బేకరీ యూనిట్‌‌‌‌‌‌‌‌, అగరబత్తులు, ఆభరణాలు, తాటి ఆకుల ఉత్పత్తులు వంటి చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఆదాయం పొందేలా ప్రోత్సహిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా బయోడీగ్రేడబుల్ సీడ్ పెన్నులను కూడా తయారు చేస్తున్నారు. పెన్నులోని ఇంక్ పూర్తయిన తర్వాత భూమిలో నాటితే మొలకెత్తేలా మర్రి, జమ్మి, వెదురు వంటి విత్తనాలను అందులో ఉంచుతున్నారు. విద్యార్థినులు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌, అమెజాన్‌‌‌‌‌‌‌‌ వంటి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ వేదికల్లో విక్రయించేలా గురుకుల కళాశాలల రాష్ట్ర కార్యదర్శి సీతాలక్ష్మి సంప్రదింపులు జరుపుతున్నారు.

ఉన్నత విద్యలోనూ సత్తా..

ఉపాధి నైపుణ్యాలతో పాటు ఉన్నత విద్యలోనూ ఖమ్మం కళాశాల విద్యార్థినులు ప్రతిభ చాటుతున్నారు. ఇద్దరు విద్యార్థినులు ఐఐటీల్లో ప్రవేశాలు సాధించగా, 11 మంది కేంద్ర విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందారు. సీపీజీఈటీ వంటి ప్రవేశ పరీక్షల్లోనూ పలువురు మంచి ర్యాంకులు సాధించారు. ఐదు వందల్లోపు రాష్ట్రస్థాయి ర్యాంకులతో పాటు బీపీడీ ప్రవేశ పరీక్షలో 11వ ర్యాంకు సాధించడం గర్వకారణమని ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. ఉన్నత విద్య, ఉద్యోగ, నియామక పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థినులకు పుస్తకాలు, మార్గదర్శకత్వం అందిస్తూ ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

ఉన్నత విద్యలోనూ ప్రతిభ..

క్లాసులు పూర్తయ్యాక ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. నేను సీడ్ పెన్నుల తయారీ నేర్చుకుంటున్నా. చదువు పూర్తయ్యాక సొంతంగా వ్యాపారం చేసుకునేలా ఈ శిక్షణ భరోసా ఇస్తోంది. మా పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు.- స్వర్ణ, డిగ్రీ సెకండియర్

ఐటీడీఏ సహకారంతో..

విద్యార్థినులు డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగాలపై ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడేలా ఈ శిక్షణ ఇస్తున్నాం. ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌‌‌‌‌‌‌‌, గురుకుల కళాశాలల రాష్ట్ర కార్యదర్శి సీతాలక్ష్మి, ప్రాంతీయ సమన్వయ అధికారి అరుణకుమారి సహకారం అందించారు. ముడిసరుకులకు ఐటీడీఏ నుంచి రూ.2 లక్షలు, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు. ఉత్పత్తుల ఆదాయంలో 70 శాతం ముడిసరుకులకు, 30 శాతం విద్యార్థులకు ప్రోత్సాహకంగా అందిస్తాం.- రజిని, కాలేజీ ప్రిన్సిపాల్