- టీజీఎస్పీ కానిస్టేబుల్‌ను చితకబాదిన బ్లూకోల్ట్స్
- వరంగల్‌లో బార్ సిబ్బందితో టీజీఎస్పీ కానిస్టేబుల్ గొడవ
- నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్
- వినకపోవడంతో బార్ సిబ్బందితో కలిసి టీజీఎస్పీ కానిస్టేబుల్‌పై దాడి
వరంగల్, వెలుగు: మద్యం మత్తులో ఉన్న టీజీఎస్పీ కానిస్టేబుల్‌ను బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ ఇద్దరు వ్యక్తులతో కలిసి చితకబాదాడు. ఈ ఘటన గ్రేటర్ వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. మామునూరు నాలుగో బెటాలియన్ (టీజీఎస్పీ)కు చెందిన మనోజ్ అనే కానిస్టేబుల్ గురువారం రాత్రి మద్యం సేవించేందుకు వరంగల్ హంటర్ రోడ్డు ఉర్సుగుట్టలోని ఓ బార్‍కు వెళ్లాడు. ఈ క్రమంలో బార్ సిబ్బంది, కానిస్టేబుల్ మనోజ్ మధ్య గొడవ జరిగి దాడి చేసుకునే వరకు వెళ్లింది. దీంతో బార్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బ్లూకోల్ట్స్ డ్యూటీలో ఉన్న మిల్స్ కాలనీ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి వచ్చి మనోజ్ ను సముదాయించే ప్రయత్నం చేశాడు.
అయినా అతను మాట వినకపోవడంతో సహనం కోల్పోయిన సంతోష్ రెడ్డి మనోజ్‍పై చేయి చేసుకున్నాడు. దీంతో మనోజ్ సైతం సంతోష్‍రెడ్డిని కొట్టాడు. ఆగ్రహానికి గురైన సంతోష్ రెడ్డితో పాటు మరో ఇద్దరు బార్ సిబ్బంది లాఠీలతో బెటాలియన్ కానిస్టేబుల్ మనోజ్‍పై దాడికి దిగారు. మనోజ్ తప్పించుకునే ప్రయత్నం చేసినా, స్థానికులు వారిస్తున్నా ఆగకుండా ముగ్గురు కలిసి మనోజ్ ను తన్నుతూ, పిడిగుద్దులతో దాడి చేశారు. ఘటనకు సంబంధించిన వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ మనోజ్ హాస్పిటల్‌లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. కంటి పైభాగంలో లాఠీ దెబ్బలు తగలడంతో కుట్లు వేసినట్లు బెటాలియన్ సిబ్బంది చెప్పారు. కాగా, మద్యం మత్తులో బెటాలియన్ కానిస్టేబుల్ తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా బార్ సిబ్బందితో కలిసి కొట్టడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బార్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో బెటాలియన్ కానిస్టేబుల్‍పై కేసు నమోదు చేసినట్లు మిల్స్ కాలనీ పోలీసులు చెబుతున్నారు.
