సురవరం జీవితం స్ఫూర్తిదాయకం..కమ్యూనిస్టు భావజాలాన్ని ఎవరూ ఏమీ చేయలేరు: ఎమ్మెల్యే కూనంనేని

సురవరం జీవితం స్ఫూర్తిదాయకం..కమ్యూనిస్టు భావజాలాన్ని ఎవరూ ఏమీ చేయలేరు: ఎమ్మెల్యే కూనంనేని
  • నాయకత్వ లక్షణాలను గుర్తించి తీర్చిదిద్దిన మహానేత: కె.నారాయణ
  • కమ్యూనిస్టుల ఏకీకరణతోనే సమసమాజ స్థాపన సాధ్యం: ప్రొఫెసర్ చక్రపాణి
  • మఖ్దూంభవన్‌‌లో సీపీఐ నేత సురవరం సుధాకర్‌‌ రెడ్డి ప్రథమ వర్ధంతి సభ

హైదరాబాద్, వెలుగు: సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌‌ రెడ్డి జీవితమంతా స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు కొనియాడారు. శనివారం హైదరాబాద్‌‌లోని మఖ్దూంభవన్‌‌లో సీపీఐ ఆధ్వర్యంలో సురవరం  ప్రథమ వర్ధంతి సభ నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సురవరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సురవరం రాసిన వ్యాసాల సంకలనం ‘ఉద్యమాక్షరం’ పుస్తకంతోపాటు ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ రచించిన ప్రత్యేక పాటను నాయకులు ఆవిష్కరించారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ.. కమ్యూనిస్టులను భౌతికంగా ఏరివేయవచ్చునేమో కానీ, ఆ భావజాలాన్ని ఎవరూ ఏమీ చేయలేరని తెలిపారు. విద్యావంతులు, ప్రొఫెసర్లు, న్యాయవ్యవస్థ, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లోనూ కమ్యూనిస్టు భావజాలం బలంగా ఉందని చెప్పారు.

సురవరం ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన పేరిట ఒక ప్రత్యేక మేధో సంస్థను (ఇన్‌‌స్టిట్యూట్) ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ.. సురవరం ఓర్పు, సహనం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. రాజకీయాల్లో ఎంతటి గడ్డు పరిస్థితులు ఎదురైనా ఆవేశపడకుండా సంయమనం పాటించేవారని, అందుకే ఆయనను ‘అపొలిటికల్ పొలిటికల్ మ్యాన్’ అనేవారని గుర్తుచేశారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టు భావజాలం మాటల్లో కాకుండా ప్రవర్తనలో కనిపించాలని సురవరం ఆచరించి చూపారన్నారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ సమసమాజ స్థాపన కేవలం అధికారంతో రాదని, కమ్యూనిస్టుల ఏకీకరణ ద్వారానే సాధ్యమని సురవరం బలంగా విశ్వసించారని తెలిపారు. ఆ దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సభలో సురవరం సతీమణి, సీనియర్ నాయకురాలు డాక్టర్ బీవీ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు వెంకయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాస్, ఈటీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.