- యువకుడు మృతి.. మరొకరు సీరియస్
- మృతుడు కోల్‌కతా వాసి
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ బెంగాల్ కు చెందిన సహస్ర చటోపాధ్యాయ నగరానికి వచ్చి జెన్ ప్యాక్ట్ లో ఉద్యోగం చేస్తూ అంజయ్యనగర్ లోని పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. ఇతని స్నేహితుడు వెస్ట్ బెంగాల్ కే చెందిన అభిరూప్ సింగ్ పేపర్ ఇండస్ట్రీ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. శుక్రవారం నగరానికి వచ్చిన అభిరూప్ సింగ్ గచ్చిబౌలిలోని ఓ హోటల్లో దిగాడు. కాగా, కోల్‌కతాకు చెందిన అబ్బాస్ సిద్దిఖ్(25) ముంబైలో రిటైల్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతను ఈ నెల 19న తన వ్యాపార ఎగ్జిబిషన్ కోసం నగరానికి వచ్చి, వెస్టిన్ బంజారాలో ఉంటున్నాడు. అబ్బాస్ కు అభిరూప్ స్నేహితుడు కాగా.. వీరిద్దరూ శుక్రవారం రాత్రి చటోపాధ్యాయను కలిశారు. తర్వాత ముగ్గురూ మాదాపూర్‌లోని బార్‌లో మద్యం సేవించారు. అనంతరం అర్ధరాత్రి చార్మినార్‌ను సందర్శించి, శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి మాదాపూర్ చేరుకున్నారు.
అక్కడ ఒకే స్పోర్ట్స్ బైక్‌పై ముగ్గురూ ఖాజాగూడ చెరువు వైపు బయలుదేరారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఖాజాగూడ నుంచి గచ్చిబౌలి వస్తుండగా.. ఎస్కీ రెండో గేటు వద్ద మితిమీరిన వేగం, మద్యం మత్తు కారణంగా బైక్ అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనక కూర్చున్న అబ్బాస్ సిద్దిఖ్ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యలో కూర్చున్న అభిరూప్ సింగ్‌కు తీవ్ర గాయాలు కాగా, దవాఖానకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. హెల్మెట్ ధరించడంతో బైక్ నడిపిన చటోపాధ్యాయ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.
