నేటి పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్య పేరుతో ప్రైవేట్ పాఠశాలలు మోపుతున్న ఫీజుల భారం మధ్యతరగతి కుటుంబాల వెన్ను విరుస్తోంది. నేషనల్ శాంపిల్ సర్వే 2025 ప్రకారం తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థిపై కుటుంబ వ్యయం రూ.2,609 కాగా, ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలలో రూ.38,479. అంటే ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాల వ్యయం ప్రభుత్వ పాఠశాల కంటే దాదాపు 14.7 రెట్లు ఎక్కువ. ఇది జాతీయ సగటు రూ.28,693 కంటే అధికం. ఈ అన్యాయమైన వసూళ్లు, పారదర్శకతలేని ఫీజులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై నిఘా పెట్టింది.
ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలలు తరగతివారీ ఫీజు వివరాలను నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలని, పాలక మండలి (గవర్నింగ్ బాడీ) సభ్యుల సంతకాలతో అధికారిక పత్రం ఉండాలని పేర్కొన్నది. సంబంధిత పరిపాలనా నివేదికలను సమర్పించాలని కూడా ఆదేశించింది. ఈ నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. G.O.Ms.No.1, Education (P.S.2), 01–-01–-1994లోని నిబంధన 11లో భాగంగా విద్యాశాఖ ఈ చర్యలు తీసుకోబోతుంది. ఈ నిబంధన ప్రకారం విద్యార్థులు లేదా తల్లిదండ్రుల నుంచి గవర్నింగ్ బాడీ నిర్ణయించిన ఫీజుకు మించి ఇతర పేర్లతో ఫీజు లేదా డొనేషన్లు వసూలు చేయరాదనే షరతు ఉంది. రూల్ 18 ప్రకారం అన్‌ఎయిడెడ్ పాఠశాలకు సొంతఫీజు నిర్మాణం ఉండాలి. దానిని నిర్ణయించే అధికారం గవర్నింగ్ బాడీకి ఉంది. ఈ క్రమంలో విద్యను వ్యాపారంగా మార్చకుండా, ఫీజుల వసూళ్లకు అడ్డుకట్ట వేసి, ప్రభుత్వ పర్యవేక్షణ బలపడాల్సిన అవసరాన్ని ఈ నిబంధనలు / రూల్స్ గుర్తుచేస్తున్నాయి.
ఫీజు నియంత్రణలో గవర్నింగ్ బాడీ పాత్ర!
రాష్ట్ర విభజన అనంతరం కూడా ఈ చట్టం అమల్లో ఉంది. G.O.Ms.No.1, తేదీ 01–-01–-1994 ద్వారా ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల స్థాపన, గుర్తింపు, పరిపాలన, నియంత్రణకు
సంబంధించిన నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాల నిర్వహణ యాజమాన్యం వ్యక్తిగతం కాదు. గవర్నింగ్ బాడీకి పరిపాలనలో కీలకమైన పాత్ర నిర్దేశించడమైనది. రూల్ 15 ప్రకారం ప్రతీ ప్రైవేట్ పాఠశాల పాలక మండలి ఏర్పాటు చేయాలి. ఈ బాడీలో విద్యాసంస్థ యాజమాన్య ప్రతినిధి, పాఠశాల కరస్పాండెంట్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నుంచి ఒక ప్రతినిధి, పేరెంట్ టీచర్ అసోసియేషన్ అధ్యక్షులు, జిల్లా విద్యాధికారి నామినేట్ చేసిన ఒక విద్యావంతురాలైన తల్లి ఉంటారు. ఈ ఐదుగురి పాలక మండలి విద్యా సంవత్సరం ఆరంభంలోనే సమావేశమై వివిధ తరగతులకు వసూలు చేయాల్సిన ఫీజు నిర్మాణం, సిబ్బంది వేతనాలపై నిర్ణయాలు తీసుకోవాలి. అడ్మిషన్స్ పూర్తయిన తరువాత పాఠశాల ఆదాయ–వ్యయ పరిస్థితిని సమీక్షించి నిర్ణయాలను ఆమోదించాలి. అదే సమయంలో రూల్ 18 ప్రకారం ఫీజు నిర్ణయించేటప్పుడు ఉపాధ్యాయుల జీతాలు, భవన అద్దె, భవన నిర్వహణ, విద్యుత్, నీరు, కార్యాలయ ఖర్చులు, తరగతి గది అవసరాలు, లైబ్రరీ, ల్యాబొరేటరీ, ఆడిట్ తదితర వాస్తవ వ్యయాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.
కాగితాలకే పరిమితమైన ‘గవర్నింగ్ బాడీ’
నేడు అనేక ప్రైవేట్ పాఠశాలల్లో గవర్నింగ్ బాడీ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. పేరెంట్ టీచర్ అసోసియేషన్ ప్రతినిధి, ఉపాధ్యాయ ప్రతినిధి, తల్లిదండ్రుల ప్రతినిధులకు నిజమైన నిర్ణయాధికారం ఉందా? ఫీజు పెంపుపై వారి అభిప్రాయం తీసుకుంటున్నారా? అనేది ప్రశ్నార్థకమే. మెజార్టీ తల్లిదండ్రులకు అసలు ప్రైవేట్ పాఠశాలలో పాలక మండలి ఉంటుందనే విషయం కూడా తెలియదు. అయినా ప్రభుత్వాలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయి. చట్టాలు ఉన్నప్పటికీ వాటిని కఠినంగా అమలు చేయడం లేదు. పాఠశాలల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యం లేకుండా విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం సాధ్యం కాదు. కాగితాలపై ఉన్న గవర్నింగ్ బాడీలు అమలయ్యేలా చర్యలు చేపట్టాలి. తద్వారా యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట వేయవచ్చు.
- సంపతి రమేష్
సోషల్ ఎనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
