నల్ల సముద్రంలో ఆయిల్ ట్యాంకర్‌ పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి: 23 మంది భారతీయులు సేఫ్.. ఇద్దరు మృతి..

నల్ల సముద్రంలో  ఆయిల్ ట్యాంకర్‌ పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి: 23 మంది భారతీయులు సేఫ్.. ఇద్దరు మృతి..

మంగళవారం(6 అక్టోబర్) రోజున  రష్యా దక్షిణ తీరంలో  ఒక చమురు ట్యాంకర్‌పై ఉక్రెయిన్ నావికాదళం డ్రోన్లతో దాడి చేసింది. దీంతో  నౌకలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ఈ చమురు ట్యాంకర్‌లో మొత్తం 23 మంది భారత పౌరులు  ఉండగా...  మంటలు విపరీతంగా చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది మొదట నౌక వద్దకు వెళ్లలేకపోయినప్పటికీ, ఆ తర్వాత 23 మంది భారతీయులను సురక్షితంగా రక్షించారు.

 సోచి రిసార్ట్ నగరం సమీపంలో ఈ ప్రమాదం జరగడంతో ఆకాశంలోకి దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. ముందుజాగ్రత్త చర్యగా స్థానిక సిరియస్(Sirius) ఫెడరల్ టెరిటరీ అధికారులు బీచ్‌లను మూసివేశారు. నీరు, గాలి నాణ్యతను పర్యవేక్షిస్తూ, ప్రజలను ఇళ్లలోనే ఉండి కిటికీలు మూసి ఉంచుకోవాలని సూచించారు.

 మరో వేర్వేరు ఘటనలో, నల్ల సముద్రంలో ప్రయాణిస్తున్న టర్కీకి చెందిన 'ఎంవి రోయాద్ మమ్మడోవ్' అనే  సరుకు రవాణా నౌకపై రష్యా డ్రోన్ దాడి జరిగింది. ఈ నౌకలో ఉన్న సిబ్బందిలో ముగ్గురు భారతీయ పౌరులు ఉన్నారు. ఈ దాడిలో ఇద్దరు విదేశీయులు మరణించగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక భారత పౌరుడు కూడా ఉన్నాడు. అతనికి ప్రస్తుతం రొమేనియాలో వైద్య చికిత్స అందిస్తున్నారు.

 రొమేనియాలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా (X)లో స్పందిస్తూ, బాధిత భారతీయ పౌరుల భద్రత, సంక్షేమాన్ని పర్యవేక్షిస్తున్నామని, సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు  సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది.

►ALSO READ | రూ.125 కోట్లతో ప్రైవేట్ జెట్ కొన్న జాయ్ ఆలుకాస్ ఫౌండర్: నెట్టింట వైరల్

 ఉక్రెయిన్ నగరాలు, ముఖ్యంగా రాజధాని కీవ్‌పై రష్యా జరుపుతున్న దాడులకు ప్రతీకారంగా ఉక్రెయిన్ రష్యా ఇంధన మౌలిక సదుపాయాలను, చమురు ట్యాంకర్లను టార్గెట్ చేసుకుంటోంది. ఇరు దేశాలు వాణిజ్య నౌకలపై కూడా దాడులు పెంచడంతో నల్ల సముద్ర తీర ప్రాంతాల్లో పర్యావరణ సమస్యలు, పెట్రోల్ లీకేజీలు తలెత్తుతున్నాయి.