4 నెలల్లో కేజీకి రూ.30 పెరిగిన బియ్యం రేట్లు.. ఇంకా పెరుగుతాయా..?

4 నెలల్లో కేజీకి రూ.30 పెరిగిన బియ్యం రేట్లు.. ఇంకా పెరుగుతాయా..?

తెలుగు రాష్ట్రాల్లో సన్న బియ్యం రేట్లు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గడచిన 4 నెలల కాలంలోనే సన్న బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. అప్పట్లో కిలో రూ.50 నుంచి రూ.55 ఉన్న ధరలు.. ప్రస్తుతం ఏకంగా రూ.65 నుంచి రూ.83కు చేరుకున్నాయి. కనీస నాణ్యత కలిగిన సన్న బియ్యం రకాలు కూడా మార్కెట్లో రూ.60 పైనే పలుకుతూ షాక్ ఇస్తున్నాయి. అంతేకాకుండా పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే నూకల ధరలు కూడా రూ.20 నుంచి రూ.30కి పెరిగాయి. ఈ పరిస్థితి సామాన్యుల వంటగది బడ్జెట్‌పై ఆర్థిక భారాన్ని మోపుతోంది.

ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం వాతావరణ మార్పులతో పంట దిగుబడి తగ్గడమే. ఎల్ నినో ప్రభావం వల్ల ఖరీఫ్ ధాన్యం పంట ఆశించిన స్థాయిలో పండే అవకాశం లేకపోగా.. రబీ సాగుపై కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. గత ఏడాది 92.17 లక్షల ఎకరాల్లో సాగైన ధాన్యం, ఈ ఏడాది కేవలం 78.23 లక్షల ఎకరాలకు పడిపోతుందని అంచనా. ఈ తగ్గుదల వచ్చే నెలల్లో సన్న బియ్యం ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పండే తెలంగాణ సన్న రకాలకు పొరుగు రాష్ట్రాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. కోతల ప్రారంభ దశలోనే కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వ్యాపారులు నేరుగా రంగంలోకి దిగి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో.. స్థానికంగా లభ్యత తగ్గి రేట్లు భగ్గుమంటున్నాయి. పరిస్థితులు చూస్తే రేట్లు ఇంకా పెరిగేలా కనిపిస్తున్నాయ్ అంటున్నారు వ్యాపారులు. 

►ALSO READ | రూ.125 కోట్లతో ప్రైవేట్ జెట్ కొన్న జాయ్ ఆలుకాస్ ఫౌండర్: నెట్టింట వైరల్

మార్కెట్లో 25 కిలోల సన్న బియ్యం బస్తాల ధరలను పరిశీలిస్తే.. జేఎస్‌ఆర్ ప్రీమియం కోలాం కిలో రూ.83.50, జేఎస్‌ఆర్ రా రైస్ రూ.74.85, లలిత సోనా మసూరి రూ.71.33, కర్నూలు సోనా మసూరి రూ.70, హెచ్‌ఎంటీ రా రైస్ రూ.69 పలుకుతున్నాయి. రిటైల్ కిరాణా దుకాణాల్లో అయితే హెచ్‌ఎంటీ రా రైస్ ఏకంగా రూ.78 వరకు అమ్ముడవుతోంది. కేవలం 15 రోజుల క్రితం రూ.70 ఉన్న ఈ ధర ఒక్కసారిగా పెరగడం గమసనార్హం. వ్యాపారుల మధ్య లావాదేవీల తీరు కూడా పూర్తిగా మారిపోయింది. గతంలో రైస్ మిల్లర్లు వ్యాపారులకు 2 నెలల గడువు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా బియ్యం సరఫరాకు 'క్యాష్ అండ్ క్యారీ' విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు.

పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు పేద, మధ్యతరగతి కుటుంబాల వెన్నువిరుస్తున్నాయి. ఉపాధి లేమి, ఇతర నిత్యావసరాల ధరల పెరుగుదల మధ్య నలిగిపోతున్న ప్రజలకు.. కొత్తగా బియ్యం ధరల బాదుడు మరింత భారంగా మారింది. ప్రభుత్వాలు స్పందించి బహిరంగ మార్కెట్లో ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన బియ్యాన్ని అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. లేదంటే రానున్న రోజుల్లో పదలు మూడుపూటల నాలుగు వేళ్లు నోట్లోకి పంపటం కూడా కష్టంగా మారుతుంది.