Mandaadi: సూరి, సుహాస్ మూవీకి అదిరిపోయే రికార్డ్.. రూ.150 కోట్ల మార్క్ దాటిన ‘మండాడి’

Mandaadi: సూరి, సుహాస్ మూవీకి అదిరిపోయే రికార్డ్.. రూ.150 కోట్ల మార్క్ దాటిన ‘మండాడి’

సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘మండాడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను నమోదు చేస్తోంది. ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలతో పాటు విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళనాడులో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది.

ఈ చిత్రంలో సూరి, సుహాస్ నటనతో పాటు మహిమా నంబియార్, సత్యరాజ్ వంటి ప్రముఖుల అభినయం సినిమాకు పెద్ద బలంగా నిలిచింది. ఇందులో వచ్చే బోట్ సీక్వెన్స్, హై-వోల్టేజ్ రేసింగ్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. కథిర్ విజువల్స్, జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం (BGM), అలాగే పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమా స్థాయిని మరింత పెంచాయి.

తాజాగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త మైలురాయిని అధిగమించింది. కేవలం తమిళనాడులోనే వంద కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రజనీకాంత్, వెట్రిమారన్ వంటి దిగ్గజాల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, హీరోలు సూరి, సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

కథ: 

‘మండాడి’ కథ సముద్రతీర ప్రాంతంలో నివసించే మత్స్యకారుల జీవితం, వారి మధ్య ఉన్న విభేదాలు, సంప్రదాయ బోట్ రేసింగ్ చుట్టూ తిరుగుతుంది. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న ముత్తు కాళి, సాట్టా పులి కాలక్రమంలో బద్ధ శత్రువులుగా మారడం కథలో కీలక మలుపు తిరుగుంది. పరిస్థితుల కారణంగా ఊరిని వదిలి హైదరాబాద్‌లో జీవిస్తున్న ముత్తు కాళి.. మల్లేశ్ అనే యువకుడి కారణంగా మళ్లీ తన స్వగ్రామానికి తిరిగి రావాల్సి వస్తుంది. అసలు మల్లేశ్ ఎవరు? అతనికి కాళితో ఉన్న సంబంధమేంటి? తిరిగి వచ్చిన కాళి ఎదుర్కొన్న సమస్యలేంటి? అనేదే అసలు కథ.

►ALSO READ | ధనుష్ రాజకీయ ఎంట్రీకి సర్వం సిద్ధం.. సైలెంట్‌గా పార్టీ పేరు రిజిస్ట్రేషన్!

సముద్ర నేపథ్యంతో తెరకెక్కిన 'మండాడి'లో పడవ పందేలు, స్నేహం, శత్రుత్వం, పగ, ప్రతీకారం వంటి అంశాలను దర్శకుడు ఆసక్తికరంగా మేళవించారు. కళింగపట్నంలో తరతరాలుగా కొనసాగుతున్న పడవ పందేల్లో మండాడి జట్టుకు ప్రాతినిధ్యం వహించే ముత్తు కాళి, సాట్టా పులి పాత్రల్లో సూరి, సుహాస్ ఆకట్టుకున్నారు. ముని పాత్రలో సత్యరాజ్ కీలకంగా కనిపించారు. ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. మహిమా నంబియార్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.