- రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటు చేయండి
- గ్లోబల్ బిజినెస్ ఎక్సలెన్స్ అండ్ లీడర్‌షిప్ కాన్క్లేవ్లో కామెంట్స్
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే పోటీతత్వం, సమ్మిళిత ఆర్థికాభివృద్ధి వేదికగా తెలంగాణ ఎదుగుతున్నదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఇరిగేషన్, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ వంటివి తెలంగాణ సొంతమని వివరించారు.
శనివారం హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో నిర్వహించిన ‘గ్లోబల్ బిజినెస్ ఎక్సలెన్స్ అండ్ లీడర్‌షిప్ కాంక్లేవ్–2026’లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. జాతీయ వృద్ధి రేటు 8 శాతంగా ఉంటే.. తెలంగాణ 10.7 శాతం గ్రోత్తో ముందు వరుసలో ఉందన్నారు. అభివృద్ధి కేవలం రాజధానికే పరిమితం కాకూడదని, రాష్ట్రంలోని ప్రతి జిల్లా, పల్లె, ప్రతి కుటుంబానికీ చేరాలన్నదే తమ ప్రజాప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు.
ఇందుకోసం రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు ఆర్థిక మండళ్లుగా విభజించామని గుర్తు చేశారు. పరిశ్రమలను హైదరాబాద్ లోనే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచ కేంద్రంగా మారిందని మంత్రి ఉత్తమ్ వివరించారు. ఇప్పుడు సెమీకండక్టర్లు, డేటా సెంటర్లు, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ వంటి భవిష్యత్ రంగాల్లో భారీ పెట్టుబడి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయన్నారు.
సాగునీరు, వ్యవసాయం, ఆహార భద్రత విభాగాల్లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమన్నారు. శాటిలైట్ ఇమేజింగ్, ఏఐ, డ్రోన్లు, సెన్సార్లు వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని సమర్థవంతమైన నీటి నిర్వహణకు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రైతుల ఉత్పత్తులకు మంచి ధర రావాలంటే.. ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ చైన్స్, వేర్‌హౌసింగ్, అగ్రి-లాజిస్టిక్స్, ప్యాకేజింగ్, ఎగుమతి రంగాల్లో పెట్టుబడులు అత్యంత అవసరమన్నారు.
