ఇక ఆన్‌‌లైన్‌‌లో పల్లె ప్రొఫైల్.. GPSAP పోర్టల్‌‌లో గ్రామ పంచాయతీ సమగ్ర సమాచారం

ఇక ఆన్‌‌లైన్‌‌లో   పల్లె ప్రొఫైల్.. GPSAP పోర్టల్‌‌లో గ్రామ పంచాయతీ సమగ్ర సమాచారం

 

  • జనాభా, ఇండ్ల వివరాల నుంచి మౌలిక వసతుల వరకు ఒక్క క్లిక్‌‌తో లభ్యం
  •     అభివృద్ధి పనుల ప్రణాళిక, ఆస్తుల వివరాల నమోదు

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీ సమగ్ర సమాచారాన్ని, అభివృద్ధి ప్రణాళికలను పారదర్శకంగా ఉంచేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ‘జీపీ ప్రొఫైల్’ (జీపీఎస్ఏపీ) వెబ్​సైట్​ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో గ్రామంలోని ప్రతి అంశాన్ని డిజిటలైజ్  చేశారు. 

జిల్లా, మండలం, పంచాయతీ కోడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యదర్శి వివరాలతోపాటు జనాభా, గృహాలు, మొత్తం జనాభా (స్త్రీ, పురుషులు, ఎస్సీ, ఎస్టీ, ఇతరులు), మొత్తం నివాస గృహాల సంఖ్య పొందుపరిచారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, తాగునీటి కనెక్షన్లు, డంపింగ్  యార్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్  షెడ్, ట్రాక్టర్ల లభ్యత, పంచాయతీ ఆధీనంలో ఉన్న భవనాలు, స్థలాలు, కేంద్ర-, రాష్ట్ర ఆర్థిక సంఘాల నిధుల వినియోగం తదితర అంశాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. 

 ఉదాహరణకు మహబూబాబాద్  జిల్లా తొర్రూరు మండలంలోని కంఠాయపాలెం పంచాయతీపై క్లిక్​ చేస్తే ఆ పల్లెకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు కనిపిస్తాయి. అంతేకాదు, గ్రామంలోని మహిళా స్వయం సహాయక సంఘాల వివరాలనూ వెబ్​సైట్​లో చూడవచ్చు.

ఇలా ఓపెన్​ చేయండి.. 

రాష్ట్ర  ప్రభుత్వ జీపీ ప్రొఫైల్(జీపీఎస్ఏపీ) పోర్టల్‌‌లో మీ ఊరి పూర్తి వివరాలను చూడటానికి మొబైల్  లేదా కంప్యూటర్‌‌లోని గూగుల్  క్రోమ్  బ్రౌజర్‌‌లో  https://gpsap-prrd.telangana.gov.in/gpprofile/ ఈ లింక్‌‌ను ఓపెన్  చేయాలి. అందులో మీ ఊరి వివరాలు ఎంచుకోవాలి. వెబ్‌‌సైట్  ఓపెన్  అయ్యాక స్క్రీన్‌‌పై కొన్ని డ్రాప్‌‌డౌన్  బాక్స్‌‌లు కనిపిస్తాయి. 

జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ ఎంచుకోవాలి. దీంతో మీ గ్రామానికి సంబంధించిన జనాభా, కుటుంబాలు, రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం, నిధులు, ప్రభుత్వ ఆస్తుల సమగ్ర నివేదిక స్క్రీన్‌‌పై కనిపిస్తుంది. దానిని మీరు పీడీఎఫ్​ రూపంలో డౌన్‌‌లోడ్  కూడా చేసుకోవచ్చని ఆఫీసర్లు చెబుతున్నారు.

రేపటి నుంచి సెక్రటరీలకు ‘సేవోత్తమ్ మోడల్’ శిక్షణ

గ్రామ పంచాయతీల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన, సంతృప్తికరమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘సేవోత్తమ్ మోడల్’ ద్వారా పౌర సేవా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల పంచాయతీ కార్యదర్శులకు రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 

హైదరాబాద్  జూబ్లీహిల్స్‌‌లోని ఎంసీఆర్ హెచ్‌‌ఆర్డీ ఇన్‌‌స్టిట్యూట్(సెంటర్  ఫర్  ఫైనాన్స్  అండ్  ఎకనామిక్స్  విభాగం) ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో ఈ శిక్షణ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 9 జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నిర్మల్  నుంచి 26 మంది సెక్రటరీ(వివిధ గ్రేడ్లు, ఓపీఎస్)లను ఈ ట్రైనింగ్  కోసం ఎంపిక చేశారు. ఎంపికైన కార్యదర్శులంతా తప్పనిసరిగా శిక్షణకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత డీపీవోలను కమిషనర్  ఆదేశించారు.