- కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు అవమానకర రీతిలో మాట్లాడుతున్నరు
- వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలి
- క్రమశిక్షణా కమిటీకి మంత్రి సురేఖ లేఖ
- హైకమాండ్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు : చిన్నారెడ్డి
హైదరాబాద్, వెలుగు: ‘‘పీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ ఇచ్చాను.. అది కమిటీ పరిశీలనలో ఉంది.. ఇలాంటి సమయంలో నన్ను, నా కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు బహిరంగంగా, అవమానకర రీతిలో మాట్లాడుతున్నారు’’ అని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. వీరి వెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులను గుర్తించి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి శనివారం ఆమె లెటర్ రాశారు.
‘‘క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే నాపై బహిరంగ విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్‌పై తీర్పులు ఇవ్వడం, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడాన్ని బట్టి క్రమశిక్షణ కమిటీ నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతున్నదా?’ అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలి’’ అని అందులో కోరారు. పార్టీ క్రమశిక్షణపై తనకు పూర్తి గౌరవం ఉందని, అదే సమయంలో, సీనియర్ బీసీ మహిళా నాయకురాలినైన తనపై మాటలతో సామూహిక దాడులు జరుగుతున్నా పార్టీ నాయకత్వం మౌనంగా ఉండడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి ఉన్న పార్టీ అని, ఆ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని లెటర్‌లో కోరారు.
