- గిల్, జైస్వాల్ గాడిలో పడతారా?
- కుల్దీప్ ప్లేస్‌లో సారాన్ష్ జైన్!
- ఉ. 10 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో లైవ్
కొలంబో: తొలి టెస్ట్ గెలిచి జోరుమీదున్న ఇండియా.. శ్రీలంకతో రెండో మ్యాచ్‌కు రెడీ అయ్యింది. ఆదివారం నుంచి జరిగే ఈ పోరులో గెలిచి మూడేళ్ల తర్వాత విదేశీ గడ్డపై తొలి సిరీస్ చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2023 జులైలో వెస్టిండీస్‌పై చివరిసారి టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌తో సిరీస్‌లను డ్రా చేసుకుంది.
ఇక ఇండియాలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌ల్లో ఓడటంతో టీమిండియా ప్రతిష్టను కాస్త దిగజార్చింది. ఈ నేపథ్యంలో లంకతో సిరీస్ గెలిచి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నారు. ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే 57.58 శాతం పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకే చాన్స్ ఉంది.
భారీ ఇన్నింగ్స్‌పై దృష్టి
తొలి టెస్ట్‌లో నిరాశపర్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్ భారీ ఇన్నింగ్స్‌పై దృష్టి పెట్టారు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు సాధించిన గిల్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో రెండుసార్లు ఔట్ కావడం ఆందోళన కలిగిస్తోంది. కెప్టెన్‌గా 10 టెస్ట్‌ల్లో 73 సగటుతో 1100 రన్స్ సాధించిన గిల్ ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
జైస్వాల్ గత ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. ఫాస్ట్ బౌలర్లు వేసే షార్ట్ పిచ్ బంతులను కట్, చిప్ షాట్లు ఆడే క్రమంలో అనవసరంగా వికెట్ పారేసుకుంటున్నాడు. తొలి టెస్ట్‌లో అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో అలాగే ఔటయ్యాడు. మిగతా బ్యాటర్లందరూ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లో ఒక్క మార్పు చోటు చేసుకునే చాన్స్ ఉంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ సారాన్ష్ జైన్ తుది జట్టులోకి రావొచ్చు. లంక జట్టులో లెఫ్టార్మ్ బ్యాటర్లు ఎక్కువగా ఉండటంతో జైన్‌ను తీసుకునే చాన్స్ ఉంది.
గాయాల బెడద..
తొలి టెస్ట్ ఓటమితో ఒత్తిడిలో ఉన్న లంక జట్టును గాయాలు పీడిస్తున్నాయి. పాథుమ్ నిశాంక, కుశాల్ మెండిస్ గాయాల నుంచి కోలుకోలేదు. చండిమల్ కంకషన్ కారణంగా టీమ్‌కు దూరమయ్యాడు. నిషాన్ మధుషక, స్పిన్నర్ రమేశ్ మెండిస్ కూడా గాయాలతోనే ఇబ్బందిపడుతున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ కోసం లంక తుది జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.
కొత్తగా వచ్చిన కమిల్ మిషారా, లాహిరు ఉదారాతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. కమింద్ మెండిస్, ధనంజయ డిసిల్వ, సోనల్ దినూష మిడిలార్డర్ బాధ్యతలు చూసుకోనున్నారు. తొలి టెస్ట్‌లో ఒకే ఒక్క బాల్ ఆడిన పసిందు సూర్యబండారపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. నిరోషన్ డిక్వెల్లా ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లో కేశర నువాంత, అసిత ఫెర్నాండో, లాహిరు కుమార ప్రభావం చూపించాల్సి ఉంటుంది. 2015 తర్వాత లంక ఇండియాపై ఒక్క టెస్ట్ కూడా గెలవలేదు. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓడి రెండింటిని డ్రా చేసుకుంది.
తుది జట్లు (అంచనా)
ఇండియా: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ / సారాన్ష్ జైన్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.
శ్రీలంక: ధనంజయ డిసిల్వ (కెప్టెన్), లహిరు ఉదార, కమిల్ మిషారా, కమిందు మెండిస్, సోనల్ దినూష, పసిందు సూర్యబండార, నిరోషన్ డిక్వెల్లా, కేశర నువాంత, ప్రభాత్ జయసూర్య, అసిత ఫెర్నాండో, లహిరు కుమార.
పిచ్, వాతావరణం
పిచ్‌పై కొద్దిగా గ్రాస్ ఉంది. పేసర్లకు అనుకూలించే చాన్స్. గాలె పిచ్‌తో పోలిస్తే పొడిగా ఉంది. వర్షం ముప్పు పెద్దగా లేదు.
