క్యూర్ పరిధిలో అడ్డగోలుగా  అక్రమ నిర్మాణాలు..లంచాలు తీసుకుని టౌన్ ప్లానింగ్ అధికారులు సైలెంట్ 

క్యూర్ పరిధిలో అడ్డగోలుగా  అక్రమ నిర్మాణాలు..లంచాలు తీసుకుని టౌన్ ప్లానింగ్ అధికారులు సైలెంట్ 
  • ఫీల్డ్ విజిట్ చేయకుండా ఆఫీసుల్లోనే సెటిల్మెంట్లు
  • 30, 40 గజాల్లో ఐదారు ఫ్లోర్లు వేసినా చర్యలు నిల్
  • ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే హడావుడి 

హైదరాబాద్ సిటీ, వెలుగు: క్యూర్(కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలోని మూడు కార్పొరేషన్లలో అడ్డగోలుగా అక్కమ నిర్మాణాలు జరుగుతున్నాయి. కొందరు కనీస అనుమతులు కూడా లేకుండా నిర్మిస్తుండగా, ఇంకొందరు ఒకటి, రెండు ఫ్లోర్లకు అనుమతులు తీసుకొని 6 నుంచి 10 అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. 2019లో 75 చదరపు గజాల్లోపు ఇండ్లను కట్టుకునే వారికి అనుమతులు అవసరం లేకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

కేవలం ఇంటిమేషన్ ఇస్తే సరిపోతుందనే రూల్స్ పెట్టింది. దాంతో చాలా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఆ తరువాత 2020లో టీజీ బీ పాస్ తరువాత ఒక్క రూపాయి చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిబంధన పెట్టారు. అలాగే 75 చదరపు గజాల్లోపు నిర్మాణాలను అధికారులు పెద్దగా పట్టించుకోవడంలేదు. దీంతో నిబంధనలను ఉల్లంఘించి 30, 40, 50 గజాల స్థలాల్లోనే 6 నుంచి 10 అంతస్తులు నిర్మిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణదారుల నుంచి లంచాలు తీసుకుని సైలెంట్‌‌గా ఉంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఫీల్డ్ విజిట్ చేయకుండా ఆఫీసుల్లోనే సెటిల్మెంట్లు చేస్తున్నారని.. దీంతో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల్లో లక్షల్లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని చెప్తున్నారు. ఈ ఏడాది మార్చిలో టోలిచౌకిలో 3 ఫ్లోర్లకు అనుమతులు పొంది 7 ఫ్లోర్లలో నిర్మిస్తున్న భవనంపై నుంచి పడి ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈ నిర్మాణం అధికారుల ముందే జరిగినా కేవలం రెండు సార్లు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తాజాగా గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌‌‌‌లో 48 చదరపు గజాల్లో 7 ఫ్లోర్లు నిర్మించి, లోపల పనులు చేస్తున్న సమయంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద పడి ఇద్దరు మరణించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేస్తున్నారు. ఆ తరువాత మాత్రం పట్టించుకోవడంలేదు.   

నిర్మించేంత వరకు ఏం చేస్తున్నట్లు.. 

అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం టౌన్ ప్లానింగ్ అధికారులకు ముందే తెలిసినా పట్టించుకోవడంలేదు. ఫిర్యాదులపై సైలెంట్‌‌గా ఉండేందుకు నిర్మాణదారుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఒక భవనాన్ని నిర్మిస్తున్నారన్న విషయం ముందుగా టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిసే ఉంటుంది. బేగంబజార్ లాంటి పబ్లిక్ ఏరియాలోనూ ఐదారు ఫ్లోర్లు నిర్మిచేంత వరకు తెలియకుండా ఉండదు. అయితే అంతా తెలిసినా కూడా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇందుకుగాను సిబ్బంది, అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 

చర్యలు తీసుకోవట్లే..  

జోన్ల వారీగా టాస్క్‌‌ఫోర్స్‌‌ బృందాలు ఉన్నప్పటికీ వారు కూడా పట్టించుకోవట్లేదు. ఓఆర్ఆర్ పరిధిలో 30 నుంచి 75 గజాలలోపు ఇండ్లు లక్షల్లో ఉన్నాయి. ఇందులో కొన్ని ఎప్పుడో ఏళ్ల క్రితం నిర్మించినవి కాగా, ఇంకొన్ని తాజాగా నిర్మిస్తున్నారు. సాధారణంగా 75 చదరపు గజాలకు మించి ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలన్న కూడా అనుమతులు తప్పనిసరి తీసుకోవాల్సి ఉంది. కానీ చాలా చోట్ల ఏమాత్రం అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు జోనల్‌‌ కమిషనర్ల ఆధ్వర్యంలో టాస్క్‌‌ఫోర్స్‌‌ బృందాలు ఉంటాయి. కాలనీలు, బస్తీల్లో పర్యటిస్తూ అలాంటి నిర్మాణాలు కనిపిస్తే జోనల్‌‌ కమిషనర్‌‌కు తెలియజేయాల్సి ఉంది.  ఆ తర్వాత వాటిపై చర్యలు తీసుకోవాలి. కానీ ఈ బృందాల్లో కొందరు వసూళ్లకు పాల్పడి అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇస్తున్నారు. ఆ తరువాత పట్టించుకోవడంలేదు. అన్ని జోన్లలోనూ ఇదే పరిస్థితి ఉంది.  

అనుమతులు పొందాల్సింది ఇలా.. 

ఇన్‌‌స్టంట్ రిజిస్ర్టేషన్, ఇన్‌‌స్టంట్ అప్రూవల్, సింగిల్ విండో మూడు కేటగిరీల్లో నిర్మాణ అనుమతులు జారీ అవుతున్నాయి. 75 చదరపు గజాల వరకు ఉన్న ప్లాట్లలో సెల్లార్‌‌‌‌తో పాటు జీ ప్లస్1 నిర్మించుకోవచ్చు. ఇలా బిల్డింగ్ ఎత్తు 7  మీటర్లకు మించరాదు. దరఖాస్తుదారులు కేవలం ఒక్క రూపాయి చెల్లించి ఆన్‌‌లైన్‌‌లో సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా నమోదు చేసుకుంటే సరిపోతుంది. వీటికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. 500 చదరపు మీటర్లలో 10 మీటర్లలోపు ఎత్తులో నివాస భవనాలకు ఇన్‌‌స్టంట్ అప్రూవల్స్ జారీ చేస్తారు.

మాస్టర్ ప్లాన్, ఇతర నిబంధనలకు అనుగుణంగా ఆన్‌‌లైన్ సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా తక్షణమే అనుమతి పొందవచ్చు. 500 చదరపు మీటర్ల కంటే  ఎక్కువ లేదా10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మాణాలకు, అలాగే వాణిజ్య భవనాలు, అపార్ట్‌‌మెంట్‌‌లకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇస్తారు. వీటికి పలు శాఖల నుంచి క్లియరెన్స్(ఎన్వోసీ)లు అవసరం ఉంటుంది.  అయితే, ఇన్‌‌స్టంట్ రిజిస్ర్టేషన్, ఇన్‌‌స్టంట్ అప్రూవల్15 రోజుల్లో ఇవ్వాల్సి ఉంది. సింగిల్ విండో అయితే 21 రోజుల్లో అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. 

రెసిడెన్షియల్ పేరుతో కమర్షియల్ దందా.. 

చాలా చోట్ల నివాస గృహాల పేరుతో అనుమతులు తీసుకుంటున్నారు. కానీ నిర్మాణం పూర్తయ్యాక వాటిని ఇష్టానుసారంగా వాణిజ్య సముదాయాలుగా మార్చేస్తున్నారు. సీఎంసీలోని అయ్యప్ప సొసైటీలో వేలాది అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థలు, హాస్టళ్లు నడుస్తున్నాయి. అధికారులు కళ్లముందే నిర్మాణాలు జరుగుతున్న కూడా అడిగేవారు కరువయ్యారు. అలాగే నగరంలోని ప్రధాన మార్కెట్లు అయిన బేగంబజార్, ఉస్మాన్ గంజ్, మదీనా మార్కెట్‌‌లతో పాటు తదితర చోట్ల 30 చదరపు గజాల్లో ఐదారు ఫ్లోర్లలో నిర్మాణాలు జరుపుతున్నారు.

ఇక్కడ భూములకు భారీగా డిమాండ్ ఉంది. బేగంబజార్‌‌‌‌లో గతేడాది రూ.10 లక్షలకు గజం పలికింది. ఇక్కడ అద్దెలు కూడా అదేతరహాలో ఉంటాయి. అందుకే 30 గజాల్లో ఐదారు ఫ్లోర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన మార్కెట్లలో ఎక్కడ చూసిన ఇదే తరహాలో ఉన్నాయి. కనీసం నడిచేందుకు కూడా జాగా లేని విధంగా కొన్నిప్రాంతాలు ఉన్నాయి.  వీటిని కూడా రెసిడెన్షియల్ పేరుతో ఇన్‌‌స్టంట్ రిజిస్ర్టేషన్ ద్వారా అనుమతులు పొందుతున్నారు.