చందానగర్, వెలుగు: ఫిర్యాదుదారుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం తీసుకున్న చందానగర్ ఎస్సై, కానిస్టేబుల్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నల్లగండ్లలోని 431 గజాల స్థలానికి సంబంధించిన ఫోర్జరీ కేసులో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసేందుకు చందానగర్ ఠాణా ఎస్సై బండెల బాలరాజ్, కానిస్టేబుల్(రైటర్) బి.రాఘవేంద్ర లంచం డిమాండ్ చేశారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు శనివారం పీఎస్లో తనిఖీలు చేపట్టారు. ఎస్సై బాలరాజ్ తన కార్యాలయంలోని టేబుల్ డ్రాలో ఉంచిన రూ.75 వేల నగదుతో పట్టుబడ్డారు. అంతకుముందే ఎస్సై రూ.20 వేలు, కానిస్టేబుల్ రాఘవేంద్ర రూ.10 వేలను యూపీఐ ద్వారా స్వీకరించినట్లు అధికారులు గుర్తించారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి, ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
