- ఉద్యోగులు, పెన్షనర్లకు తక్షణమే క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్
- సెక్రటేరియెట్‌లో ఈహెచ్‌సీటీ ఉన్నత స్థాయి భేటీ సక్సెస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల కోసం తీసుకొచ్చిన ‘న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ అమలులో కీలక ముందడుగు పడింది. సెక్రటేరియెట్ లో శనివారం ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ) సీఈఓ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తెలంగాణ స్టేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఎస్‌హెచ్‌ఏ) పరిధిలోని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ పథకానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి. అపోలో, యశోద, కిమ్స్, కాంటినెంటల్ వంటి ప్రముఖ హాస్పిటల్స్ ప్రతినిధులు హాజరై, లబ్ధిదారులకు తక్షణమే నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు అంగీకరించారు.
ఈ భేటీలో టీజీ-జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తో పాటు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు పాల్గొని పథకం అమలు తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. హాస్పిటల్స్ యాజమాన్యాలు సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగులు, పెన్షనర్లకు కార్పొరేట్ వైద్యం భారం లేకుండా అందుబాటులోకి వచ్చింది. ఎంపానెల్డ్ హాస్పిటల్స్ అన్ని లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో నాణ్యమైన చికిత్స అందించాలని ఈహెచ్‌సీటీ విజ్ఞప్తి చేసింది.
పథకాన్ని విజయవంతంగా అమలులోకి తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహాతో పాటు ఇతర ఉన్నతాధికారులకు ట్రస్ట్ సభ్యులు గిరి శ్రీనివాస్ రెడ్డి, సదానందం గౌడ్, ఏ. వెంకటి, గజేందర్, ప్రేమ్, శ్యామ్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేట్ హాస్పిటల్స్ సహకారంతో లక్షలాది మంది ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు పూర్తి భరోసా లభించిందని వారు హర్షం వ్యక్తం చేశారు.
