- ఉడాన్ పథకం భారీ విస్తరణ
- రూ.28 వేల కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ: చిన్న సిటీలకు విమాన సర్వీసులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్(ఉడాన్) పథకాన్ని భారీగా విస్తరించాలని నిర్ణయించింది. పథకం తదుపరి దశ కోసం రూ.28,840 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. వీటితో 100 కొత్త విమానాశ్రయాలను, 200 ఆధునిక హెలిప్యాడ్‌లను నిర్మిస్తారు.
ఈ ఏడాది మార్చి 25న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రపోజల్‌కు ఆమోదం దక్కింది. ఈ పదేళ్ల ప్రణాళిక 2026 నుంచి 2036 వరకు అమల్లో ఉంటుంది. దీనివల్ల మారుమూల, కొండ ప్రాంతాలకు కూడా విమాన సర్వీసులు సులభంగా అందుబాటులోకి వస్తాయి. గత పదేళ్లలో విమానాశ్రయాల అభివృద్ధికి సుమారు రూ.10 వేల కోట్లు పెట్టుబడి పెట్టినట్లు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మైసూర్ లో జరిగిన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో వెల్లడించారు.
కొత్త ఎయిర్‌పోర్టులు, హెలిపాడ్ల కోసం గతంలోనే రూ.12,159 కోట్లు కేటాయించారు. కొండ ప్రాంతాలు, ద్వీప ప్రాంతాల్లో హెలిప్యాడ్స్ కోసం రూ.3,661 కోట్లు కేటాయించారు. సుమారు 441 ఎయిరోడ్రోమ్స్ నిర్వహణ కోసం రూ.2,577 కోట్లు ఇచ్చారు. విమానయాన సంస్థలకు వీజీఎఫ్ కింద రూ.10,043 కోట్లు అందించనున్నారు.
లాభాలు తక్కువగా ఉండే ప్రాంతీయ విమాన సర్వీసులను నిర్వహించడానికి ఎయిర్‌లైన్స్‌కు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) అంటారు. పైలట్ శిక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ట్రైనింగ్అకాడమీల సంఖ్యను 32 నుంచి 41 కి పెంచారు. విమానయాన రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి దేశీయంగానే నైపుణ్యం కలిగిన సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
