- ఇతర రాష్ట్రాల్లోని స్కీమ్‌లపై స్టడీ చేసిన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు
- సభ్యులు, కళాకారుల నుంచి అభిప్రాయాల సేకరణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చేతివృత్తులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పథకాలను బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు అధ్యయనం చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు అలోక్ కుమార్, మామిడి హరికృష్ణ, ఉదయ్ ప్రకాశ్, సంధ్య, ఆశన్న పర్యటించారు. ఈ స్టడీ టూర్ పై శనివారం మాసబ్ ట్యాంక్‌లోని బీసీ వెల్ఫేర్ ఆఫీస్‌లో కమిషనర్ బాలమాయదేవి, అలోక్ కుమార్.. కులవృత్తులు, చేతివృత్తుల కళాకారులు మరియు సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. చేతివృత్తుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించడమే కాకుండా, వారి అభిప్రాయాలను సేకరించారు.
శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలి..
కుమ్మర చేతివృత్తుల కళాకారుల అభ్యున్నతికి నిర్దిష్ట ప్రణాళిక, సిలబస్‌తో రాష్ట్రంలో ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పలువురు కళాకారులు ఆఫీసర్లకు సూచించారు. వృత్తి కళాకారులకు పెన్షన్, ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు. జిల్లా స్థాయిలో కుమ్మర చేతివృత్తుల వారు రూపొందించిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని, నైపుణ్య కేంద్రం కోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బోనాలు, వినాయక చవితి మరియు ఇతర పండుగల సందర్భంగా మట్టి పాత్రలు, కుండలు, విగ్రహాలను ఉపయోగించేలా ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మట్టితో రూపొందించిన కూజాలు, పాత్రలు, గ్లాసులను ఉపయోగించేలా ఆదేశాలివ్వాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత వస్తువుల వినియోగం దిశగా మట్టి పాత్రల వాడకాన్ని ప్రత్యామ్నాయంగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీని ఉత్పత్తి తయారీలో ఉపయోగించుకునేలా యువతకు శిక్షణ అందించాలని కోరారు.
